కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26 : రాష్ట్రమంతా మరోసారి కరీంనగర్ వైపు చూసే విధంగా దీక్షా దివస్‌ను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రగిలిందని, ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి శాసనమండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల అభివృద్ధిలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్లో సాగిన ప్రగతి ఇప్పుడు కనిపించడం లేదని మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇచ్చామని, ఇక ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా మరో ఉద్యమం కరీంనగర్ నుంచే చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందని, దానిపై రానున్న రోజుల్లో నిలదీస్తామని, ఆరు గ్యారంటీలపైనా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించారని, దానిని ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు.
అల్గునూర్ చౌరస్తాలో దీక్షా దివస్‌కు అనుమతి ఇచ్చేందుకు పోలీసు యంత్రాగం సిద్ధంగా లేనట్టు తెలుస్తున్నదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ కార్యక్రమమైన దీనికి ఎలాంటి అడ్డంకులూ సృష్టించకుండా అనుమతులు ఇవ్వాలని కోరారు. పెద్ద ఎత్తున నిర్వహించే దీక్షా దివస్‌కు జిల్లాలోని పార్టీ శ్రేణులంతా భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల విజయ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విజయవంతం చేద్దాం
దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షే కారణం. అప్పుడు కేసీఆర్‌ను అరెస్టు చేసిన ప్రాంతంలోనే దీక్షా దివస్ చేపట్టాలి. దీనికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యమస్ఫూర్తి నింపేలా దీక్షా దివస్
నవంబర్ 26 సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఆ రోజు దేశ చరిత్రలో ఎంత ముఖ్యమో.. రాష్ట్ర చరిత్రలో అంతే ముఖ్యం. ఉద్యమ సమయంలో ఆమరణ దీక్షపై నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చిన రోజు అది. ఆ తర్వాత 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు కదిలారు. ఆ రోజు ఉద్యమం రాష్ట్రమంతా రగిలింది. ఈ నెల 29న మళ్లీ ఉద్యమ స్ఫూర్తిని నింపేలా దీక్షా దివస్ నిర్వహిద్దాం. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌పై విజయవంతం చేద్దాం. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 6 వరకు కార్యక్రమాలు సాగుతాయి. ఇక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించాలని కేటీఆర్ హాజరవుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతున్నది. ఆనాడు ఆంధ్రా వలస పాలన మీద పోరాటం చేశాం. మళ్లీ అదే పరిస్థితి రాబోతున్నది. మరోసారి మలి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది.
– బండ ప్రకాశ్, శాసనమండలి ఉపాధ్యక్షుడు
మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం
రానున్న రోజుల్లో తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగరడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. స్వరాష్ట్రం కోసం గతంలో కేసీఆర్ కరీంనగర్ నుంచే ఆమరణ దీక్షకు కార్యచరణ చేపట్టారు. రాష్ట్ర సాధన ఓ చరిత్ర. దీక్షా దివస్‌కు 20 వేలకు పైగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
శ్రేణులు తరలిరావాలి
కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీక్షా దివస్‌తో మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపేలా పోరాడుదాం. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి.
– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సత్తా చూపించాలి
మొదటి నుంచి తెలంగాణ జెండాకు కరీంనగర్ గడ్డనే అండగా నిలిచింది. దీక్షా దివస్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రం మొత్తం మరోసారి కరీంనగర్ వైపుగా చూసేలా జిల్లా సత్తా చూపించాలి. – సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
పోరాట పటిమ చూపాలి
మరోసారి ఉద్యమ పోరాట పటిమను చూపించాల్సిన అవసరం ఉంది. దీక్షా దివస్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లో ఎత్తి చూపించాలి. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. నాలుగేళ్లు పోరాడాలి. గతేడాదిగా ప్రభుత్వ తీరుతో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. పార్టీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలి.
– సునీల్‌రావు, కరీంనగర్ మేయర్