యూరియా కోసం రైతులోకం భగ్గుమంటున్నది. ఊరూరా రగిలిపోతున్నది. ఒక్క బస్తా కోసం పోరాటమే చేస్తున్నది. సోమవారం దుర్శేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. వందలాది మంది దుర్శేడ్ రాజీవ్హ్రదారిపై రాస్తారోకో చేశారు. మహిళా రైతులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ‘యూరియా ఏది ఉయ్యాలో.. ఇంకెన్ని రోజులకు ఇస్తరు ఉయ్యాలో..’ ‘కేసీఆర్ పాలనలో ఏ గోస లేదు ఉయ్యాలో.. కాంగ్రెస్ పాలనలో అరిగోస పడవడ్తిమి ఉయ్యాలో..’ అంటూ పాటలతో తమ ఆవేదనను తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయంటూ ధ్వజమెత్తారు.
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 15 : యూరియా కోసం దుర్శేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు రోడ్డెక్కారు. సోమవారం వందల సంఖ్యలో కరీంనగర్ శివారులోని దుర్శేడ్‌కు చేరుకున్నారు. రాజీవ్హ్రదారిపై మహిళలు బతుకమ్మ ఆటలు ఆడి వినూత్న నిరసన తెలిపారు. యూరియా బస్తాలతో పాటు దానిపై బతుకమ్మ పెట్టి.. సర్కారుకు తీరును ఎండగట్టేలా పాటలు పాడుతూ హోరెత్తించారు.
‘ఒక యూరియా బస్తా కోసం ఉయ్యాలో.. పడిగాపులు పడుతున్నరు ఉయ్యాలో’ ‘యూరియా ఏది ఉయ్యాలో.. యూరియా ఎప్పుడిస్తరు ఉయ్యాలో..’ అంటూ ప్రభుత్వ వ్యతిరేక పాటలు పాడుతూ నిరసన తెలిపారు. వీరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. అధికారులు రాకపోవడంతో రాజీవ్ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంటకు పైగా జరిగిన ఆందోళనతో పెద్దపల్లి వైపు మొగ్దుంపూర్ వరకు, కరీంనగర్ వైపు చల్మెడ దవాఖాన వరకు వాహనాలు నిలిచిపోగా, పోలీసులు చేరుకుని విరమించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడికి ఏఈవో రాగా, జిల్లా అధికారులను పిలిపించాలని, యూరియా అవసరం ఎంత ఉంటే ఎంత వచ్చిందో వివరాలు కావాలని, బ్లాక్ మార్కెట్లో ఉన్నది తీసుకువచ్చి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డీఏవో స్పందించక పోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా రైతులు అడ్డుగా నిలిచారు. దీంతో వారిని సైతం పోలీసులు బస్సుల్లో స్టేషన్‌కు తరలించారు.
నిరసనలో కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీలు వేల్పుల నారాయణ, తిరుపతి నాయక్, కూర శ్యాంసుందర్‌రెడ్డి, బోనాల శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, తోట రాములు, సుంకిశాల సంపత్‌రావు, గోనె నర్సయ్య, ఊరడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.