MLA Gangula Kamalakar : కరీంనగర్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42వ డివిజన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గంగుల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై ఓటర్ లిస్టును తప్పుల తడకగా మార్చి, మా కుటుంబానికి సంబంధించిన ఓట్లనే వేరే డివిజన్లలోకి మార్చే ప్రయత్నం చేశారని.. నిలదీయడంతో మళ్లీ ఓటర్ లిస్టు సరి చేశారని ఇది మా మొదటి విజయమనీ గంగుల వెల్లడించారు. నిన్నటికి నిన్న సీపీఎఫ్ అనే యాప్ ద్వారా రిజర్వేషన్లలో మార్పులకు ప్రయత్నం చేయగా సోషల్ మీడియాలో ఎండగట్టామని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. నేడు రిజర్వేషన్లు సక్రమంగా వచ్చాయని ఇది మా రెండో విజయం అన్నారు ఎమ్మెల్యే. నగర మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడం ద్వారా బీసీలమంతా ఒక్కటై నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఇది మా మూడో విజయం కాబోతుందని గంగుల పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలో దొంగలు ఉన్నారని, విజ్ఞులైన ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 40ఏళ్లుగా కాంగ్రెస్ బీజేపీ పరిపాలించారని 40 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం అన్నారు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానం ఉన్న విషయాన్ని గంగుల గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని.. అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్లలో ప్రభుత్వాలు చేసింది శూన్యం అని గంగుల ఎద్దేవా చేశారు. మా హయంలో తీసుకువచ్చిన 1600 కోట్ల రూపాయల జీవోలను చూపిస్తామని .. మీరు తీసుకువచ్చిన అని చెబుతున్న కనీసం రెండు రూపాయల జీవోలు చూపిస్తారా అని కాంగ్రెస్‌కు ఆయన సవాల్ విసిరారు.
మా ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, నగరంలో అందమైన కూడళ్లు వీటన్నింటినీ గాలికి వదిలేసారని.. కనీసం రోడ్లపై గుంతలు పడితే పూడ్చడానికి కూడా రెండు రూపాయల నిధులు తీసుకురాని ఈ రెండు ప్రభుత్వాలు రాబోయే మూడేళ్లు ప్రజలకు ఏం చేస్తాయో అందరూ గమనించాలని గంగుల కోరారు. అవినీతి పాలన లేకుండా నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, దిండిగాల మహేష్, గందె మహేష్, బోనాల శ్రీకాంత్, వాల రమణారావు, ఎడ్ల అశోక్, నాయకులు సుంకిశాల సంపత్ రావు, జువాడి రాజేశ్వరరావు, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.