కోరుట్ల, జూన్ 19 : కోరుట్లలో ఈ నెల 28న నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. గురువారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా పోస్టర్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ జాబ్ మేళా లో 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. సాప్ట్వేర్, సర్వీసెస్ కంపెనీలు, ఫైనాన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, బ్లూ కలర్ జాబ్స్ కంపెనీల్లో సుమారు రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, ఫార్మసీ డిప్లొమా కోర్సులు చదివిన యువతీ యువకులకు అవకాశాలున్నాయని చెప్పారు.
ఇంటర్వ్యూల కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే జాబ్ మేళా వివరాల కోసం 78936363 13, 9948335533 సెల్ నంబర్లో సంప్రదించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగం ఎంతో పురోభివృద్ధి సాధించిందని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితి
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, ఆదాయంలో స్థూల ఉత్పత్తిలో అట్టడుగు స్థాయికి చేరిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఆయనవన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, అందాల పోటీలు నిర్వహించి నవ్వులపాలైందన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరి నాట్లకు ముందు రైతుబంధు, పెట్టుబడి సాయం అందిస్తే, సీఎం రేవంత్ రెడ్డి ఓట్లకు ముందు పబ్లిసిటీ కోసం రైతు భరోసా తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. ఏపీలో నిర్మిస్తున్న బనకచర్లపైనే కాకుం డా, తెలంగాణలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పైనా సీఎంకు అవగాహన లేకపోవడం ఆయన బాధ్యతా రహిత పాలనకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి వెంకటరావు, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు భాసర్ రెడ్డి మోహన్ రెడ్డి, మురళి, అతిక్, నగేష్, గంగాధర్, సురేందర్, సంతోష్, నవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.