మంథని, నవంబర్ 6: మంథనిలో మంగళవారం జరగనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. సోమవారం మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట స్థానిక భారత్ పెట్రోల్ పంపు సమీపంలోని సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయించానని చెప్పారు.
సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పెద్దసంఖ్యలో ఆశీర్వాద సభకు హాజరై ప్రగతి ప్రదాతకు కృతజ్ఞత చాటాలని కోరారు. ప్రజలు మధ్యాహ్నం ఒంటిగంటలోపే సభవద్దకు చేరుకొనేలా చొరవచూపాలని సూచించారు. కాంగ్రెస్ మోసాలను నియోజకవర్గ ప్రజలు గమనించారని.. రానున్న ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిపై ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు.
రాష్ట్రంలో, మంథనిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి మంథనిలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం నుంచి నాలుగో సారి బరిలో నిలువడం మంథనిలో ఒక చరిత్ర అని అన్నారు. సీఎం కేసీఆర్ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సభకు హాజయ్యే ప్రజలకు టెంట్లు, కుర్చీలు, కూలర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాగునీటి సదుపాయంతో పాటు భోజన సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, కొత్త శ్రీనివాస్, తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, సెగ్గెం రాజేష్, కావేటి సతీష్, శ్రీపతి బానయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు.