వేములవాడ రూరల్, ఫిబ్రవరి 23: ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ మండలం రుద్రవరం, అనుపురంలో కేజీ కల్చర్, కుట్టుమిషన్ శిక్షణ, మిల్లేట్ల తయారీపై మత్స్యశాఖ, నాబార్డు సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్పర్సన్ అరుణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
రుద్రవరంలో కేజీ కల్చర్ నిర్వహణపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్య్సకార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు కేజీ కల్చర్ వల్ల జరిగే లాభాలను వివరించామన్నారు. అలాగే అనుపురంలో మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌పై శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. అనంతరం కుట్టు మిషన్ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి, డీఆర్డీవో శేషాద్రి, నాబార్డు ఏజీఎం మనోహర్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీటీసీ శేఖర్, గాలిపెల్లి సువర్ణస్వామి, నాయకులు పాల్గొన్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 23: వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హాజరై భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు రేణికింది అశోక్, సంఘం నాయకులు బుస్సా దశరథం, కట్కూరి శ్రీనివాస్, చేపూరి రవి, దైత కుమార్ పాల్గొన్నారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 23: బావుసాయిపేటలో భూనీలసమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. శనివారం వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేయగా అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక్కడ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పాషా, నేతలు పాల్గొన్నారు.