సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది.. కాళేశ్వరం జలాలతో చెరువులు నిండుగా మారి, ఊరుకు జలకళను తీసుకొచ్చాయి.. మండువేసవిలోనూ మత్తళ్లు దుంకగా, భూగర్భ జలాలు ఉబికిరావడంతో భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక ప్రగతికి మళ్లీ పునాదులు పడి, వివిధ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల వేళ నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తుండగా, గడిచిన తొమ్మిదేళ్లలో చెరువు జలజీవం పోసుకొని, ఊరంతటికీ బతుకుదెరువులా మారిన తీరుపై నమస్తే ప్రత్యేక కథనం..
– కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ)
నాటి సమైక్య పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిర్వహణ లేక ఉనికిని కోల్పోయాయి. కట్టలు తెగిపోయాయి. తూములు, మత్తళ్లు దెబ్బతిన్నాయి. పిచ్చిమొక్కలు, తుమ్మ పొదలతో అధ్వానంగా మారాయి. పూడిక నిండి నీటిని నిల్వచేయలేని దుస్థితికి చేరుకున్నాయి. ఎంత భారీ వానపడినా చుక్క నీరు కూడా ఆగకపోయేది. ఫలితంగా ఆయకట్టుకు సాగునీరందక భూములను బీళ్లుగా ఉంచాల్సి వచ్చింది. కానీ, స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మిషన్ కాకతీయతో చెరువులు పునర్జీవం పోసుకున్నాయి.
రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం చెరువులు 4,283 చెరువులు ఉండేవి. వీటి పరిధిలో 15.73 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. నాడు చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో కేవలం 4.89 టీఎంసీల నీరు మాత్రమే అక్కడక్కడా చెరువుల్లో నిలిచి ఉండేది. మొత్తం చెరువుల కింద 2 లక్షలకుపైగా ఎకరాలకు ఆయకట్టు ఉన్నా 1.27 లక్షల ఎకరాలకు మాత్రమే.. అదీ ఒక పంటకే నీరందేది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద 1,833 చెరువులను 741.18 కోట్లతో పునరుద్ధరించింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం 19.93 టీఈఎంసీలకు చేరింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో నిండు వేసవిలో కూడా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. ప్రస్తుతం 11.11 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఫలితంగా భూగర్భ జలాలు వృద్ధి చెంది బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లుంటున్నాయి. గతంలో ఎక్కడో 20 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 4 నుంచి 5 మీటర్ల పైకి ఎగబాకాయి. ఫలితంగా చెరువులు, కుంటల కింద ప్రస్తుతం 1,98,588 ఎకరాల ఆయకట్టులో రెండు పంటలూ పుష్కలంగా పండుతున్నాయి. మిషన్ కాకతీయతో ఇప్పటి వరకు 71,487 ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. ప్రభుత్వం తెచ్చిన నదులకు పునరుజ్జీవం కార్యక్రమం కూడా ఉమ్మడి జల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నది. గతంలో చెక్‌డ్యాంలు, మాట్లు కలిపి కేవలం 83 మాత్రమే ఉండేవి. అందులో పెద్దపల్లి జిల్లా పరిధిలోని మానేరు, గోదావరిపైనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1,004.19 కోట్లు వెచ్చించి 148 చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నది.
నేడు ఊరూరా చెరువుల పండుగ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ జరుపుతారు. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా చేరుకుంటారు. కట్ట మైసమ్మ పూజ, చెరువు నీటికి పూజ చేస్తారు. సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సహపంక్తి భోజనాలు చేస్తారు. అన్ని జిల్లాల్లో నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
సిరులు పండిస్తున్న సింగపూర్ చెరువు
ఇదీ హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని పెద్ద చెరువు (లాడ్జ్ ట్యాంక్). ఇది నిజాం ప్రభుత్వ కాలంలో నిర్మాణమైంది. దీని కింద 281 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఒకప్పుడు ఈ చెరువు నిండితే చుట్టుపక్కల 15 గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగేవి. బావుల్లో పుష్కలంగా నీళ్లుండేటివి. ఏడాదిలో రెండు పంటలు పండేవి. క్రమంగా ఈ చెరువు నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగి, ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, స్వరాష్ట్రంలో ఈ చెరువు జీవం పోసకున్నది. రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ మొదటి విడత కింద 56.41 లక్షలు వెచ్చించి పునరుద్ధరించింది. 1,020 మీటర్ల పొడవున్న కట్టను బలోపేతం చేసింది. పూడిక తీయించి, మత్తడికి మరమ్మతులు చేయడంతోపాటు రెండు తూములకు కొత్తగా షట్టర్లు బిగించింది.
దీంతో నాడు 40 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ (ఎంసీఎఫ్‌టీ) ఉన్న నీటి నిల్వ సామర్థ్యం ఇప్పుడు 50 ఎంసీఎఫ్‌టీకి పెరిగింది. మత్తడి నుంచి వచ్చే నీటిని పొలాలకు తరలించేందుకు పైప్ కల్వర్టులు నిర్మించడంతో చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందుతున్నది. ఈ చెరువు మొదటిసారి 2016 సెప్టెంబర్‌లో మత్తడి దుంకిన దృశ్యాన్ని చూసి ఊరుఊరంతా మురిసి పోయింది. అప్పటి నుంచి ఈ చెరువు నిత్యం నీటితో కళకళలాడుతున్నది. ప్రత్యక్షంగా 281 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ చెరువు, పరోక్షంగా వెయ్యి ఎకరాల్లో పంటలకు జీవం పోస్తున్నది. ఇప్పుడు ఒక్క సింగపూర్ గ్రామస్తులే కాదు, చుట్టపక్కల ఉన్న పదిహేను గ్రామాల ప్రజలు సంతోషిస్తున్నారు. తమ గ్రామాల్లోని బావులు, బోర్లలో కూడా నీరు సమృద్ధిగా చేరిందని,రెండు పంటలు సాగు చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ కాకతీయతో మార్పులు
మిసన్ కాకతీయ అమలుకు ముందు తర్వాత పరిస్థితులను పరిశీలిస్తే అనేక మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి. గతంతో పోలిస్తే చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. నీటి లభ్యత పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మొదటి రెండేళ్లలోనే పంటల విస్తీర్ణంలో వరి సాగు 49.2 నుంచి 62.1 శాతానికి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందుబాటులోకి రావడం, ఈ నీటితో అనేక చెరువులను నింపడం వంటి కారణాలతో వరి సాగు 80 శాతానికి ఎగబాకింది. ఈ యేడాది వానకాలం కంటే యాసంగిలో 7.2 శాతంగా వరి సాగు పెరగడం విశేషం. గతేడాది పత్తి సాగు విస్తీర్ణం చూస్తే 36.2 నుంచి 26.3 శాతానికి తగ్గింది. ఇక దిగుబడి విషయానికి వస్తే వరిలో 4.1 శాతం, పత్తిలో 4.7 శాతం పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. చెరువు నుంచి తొలగించిన పూడిక మట్టిని 8.5 శాతం మంది రైతులు తమ భూముల్లో చల్లుకున్నారు. దీంతో ఈ కుటుంబాలకు రసాయన ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గింది. రసాయన ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది. ఇది ఎకరాకు 1,500 నుంచి 3 వేల వరకు పంట రకాన్ని బట్టి రైతుకు పెట్టుబడి తగ్గించింది. పూడిక మట్టి చల్లుకున్న రైతులకు మంచి ప్రయోజనాలు దక్కాయి. దిగుబడిలో పెరుగులద కనిపించింది. ఒక్క ఎకరాకు వరిలో 2 నుంచి 5, పత్తిలో 2 నుంచి 4, కందిలో 0.5 నుంచి 1.5, మక్క దిగుబడిలో 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి పెరిగినట్లు అధ్యయనంలో తేలింది.
మత్స్యకారులకూ ప్రయోజనం
చెరువుల పునరుద్ధరణతో చేపల ఉత్పత్తి కూడా పెరిగింది. 2013-14 బేస్ సంవత్సరంతో పోల్చినపుడు 36 నుంచి 56 శాతంగా ఉన్నది. దీంతో పునరుద్ధరణకు నోచుకున్న ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరిగింది. అందులో వ్యవసాయ ఆదాయం 52.4 శాతంగా నమోదైంది. మిషన్ కాకతీయ అమలుకు ముందు అంటే 2013-14 సంవత్సరాన్ని బేస్‌లైన్‌గా, 2016-17లో నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్కాన్ అధ్యయనం చేసింది. మిషన్ కాకతీయ అమలు తర్వాత ప్రభావిత సంవత్సరంగా తీసుకుని కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో భిన్నమైన ఆగ్రో ైక్లెమాటిక్ జోన్లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఉమ్మడి జిల్లాలోనే మిషన్ కాకతీయ ఎక్కువ ప్రభావం చూపినట్లు వెల్లడైంది. వర్షపాతం, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు, పంటల విస్తీర్ణంలో పెరుగుదల, పంటల దిగుబడి, పూడిక మట్టి వినియోగం, పెరిగిన ఆదాయం, మిషన్ కాకతీయ తర్వాత చెరువుల పరిస్థితి వంటి అంశాలపై ఈ అధ్యయనం సాగింది. 2019లో కూడా పలు సంస్థలు ఇదే విధంగా అధ్యాయనం చేశాయి. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. మిషన్ కాకతీయ ఫలితాలు, ప్రయోజనాలు మిగతా జిల్లాల కంటే ఉమ్మడి జిల్లాలోనే అధికంగా కనిపిస్తున్నాయి.
పోతారం గోస తీరింది
పోతారం. మల్యాల మండలంలోని గ్రామం. జగిత్యాల-కరీంనగర్ రహదారిపై, జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కెనాల్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే కాకతీయ కాలువ కంటే ఈ గ్రామం ఎగువన ఉండడంతో ఒక్క డిస్టిబ్యూటరీ కూడా లేకపోవడంతో గ్రామం నాన్ కమాండ్ ఏరియాలోకి వెళ్లిపోయింది. అయితే గ్రామానికి పెద్ద చెరువు ఉంది. ఇది గొలుసుకట్టు చెరువు. 230 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ చెరువు ఆధారంగానే రైతులు ఎవుసం చేసేవారు. పోతారం చెరువు నిండి అలుగు పారితే అక్కడి నుంచి నీళ్లు గోపాలకుంటకు, అక్కడి నుంచి రాజారాం చెరువుకు, జగిత్యాల రూరల్ మండలం మోతె చెరువుకు చేరతాయి. అయితే గత పాలనలో సాగునీటి రంగంపై పట్టింపు లేకపోవడంతో 50ఏండ్లుగా ఈ చెరువు పూడుకుపోయింది. దీనికి తోడు వర్షాలు సరిగా పడకపోవడం, చెరువులు నింపేందుకు వేరే మార్గం లేకపోవడంతో తుమ్మలు మొలిసి ఎందుకు పనికిరాకుండా పోయాయి.
గ్రామంలో చెరువుపై ఆధారపడ్డ బెస్త కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. కాకతీయ కెనాల్ ద్వారా చెరువును నింపాలని గ్రామస్తులు కోరినా పాలకులు పట్టించుకోలేదు. 20 ఏండ్ల క్రితం పోతారం నుంచే ఎస్సారెస్పీ వరద కాలువ తవ్వారు. ఈ కాలువకు సైతం గ్రామస్తులు భూమిని ఇచ్చారు. కాలువ వస్తే తమ గ్రామానికి నీళ్లు వస్తాయని, చెరువు నిండుతుందని భావించారు. కానీ, ఏం ప్రయోజనం దక్కలేదు. అప్పటి ప్రభుత్వాలు వరద కాలువకు తూములు పెట్టి చెరువులు నింపేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బోర్లు వేసుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. నాన్ కమాండ్ ఏరియా కావడంతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుకోవడంతో బోర్లపై వ్యవసాయం చేయడం ఇబ్బందికరంగా మారిపోయింది. స్వరాష్ట్రం వచ్చే నాటికి పోతారంలో 188 ఎకరాల్లో మాత్రమే భూమి సాగుకు జరిగేది. అయితే స్వరాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ సుముఖత మేరకు రైతులు వరద కాలువకు తూములు పెట్టి, పోతారం చెరువులోకి మళ్లించడం ఆరంభమైంది.
వరద కాలువను బేస్ చేసుకొని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మొదలు పెట్టి, వరద కాలువను జీవనదిగా మార్చివేయడంతో గ్రామ దశమారిపోయింది. పోతారం చెరువుకు మళ్లీ జలకళ, జీవకళ వచ్చాయి. మూడేండ్లుగా ఏడాది పొడవునా నిండుగానే కనిపిస్తున్నది. ఒకప్పుడు ఉపాధి లేకుండా పోయిన బెస్త కుటుంబాలకు మళ్లీ ఉపాధి కలుగుతున్నది. ప్రస్తుతం పోతారం చెరువు గంగపుత్రులకు దారి చూపుతున్నది. ఏడాది పొడవునా చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నారు. చెరువు నిండుగా ఉండడంతో భూగర్భజలాలు పైకి ఉబికి వచ్చాయి. తాగునీటి తిప్పలు తప్పాయి. చెరువు గట్టు అందాలను బంధించేందుకు గ్రామస్తులు ప్రతిరోజు సాయంత్రం సెల్ఫోన్లతో, కెమెరాలతో సందడి చేస్తూనే ఉన్నారు. ఇక వ్యవసాయం పరిస్థితి చెప్పాల్సిన పనేలేకుండా పోయింది. 2014లో 188 ఎకరాల్లో సాగు ఉంటే ఇప్పుడు ఏకంగా 1344 ఎకరాల్లో సాగు అవుతుండడం విశేషం.
ఊరుకే కళ వచ్చింది..
మాది పోతారం. మేం ఎవుసం చేసుకుంటూ బతుకుతున్నాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊరి పెద్ద చెరువు నిండలేదు. వేసిన పంటలు చేతికందకుండా పోయేవి. కానీ 2014లో స్వరాష్ట్రం సాధించాక మా ఊరు పెద్ద చెరువు నింపేందుకు వరద కాలువకు రెండు తూములు పెట్టారు. ఏటా రెండుసార్లు నింపుతున్నారు. తద్వారా భూగర్భ జల నీటి మట్టం స్థాయి పెరగడంతో మా ఊరి శివారు మొత్తం పచ్చటి పంట పొలాలను సాగు చేస్తున్నాం. తద్వారా రైతు గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. అంతేకాక మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం ద్వారా బెస్త, బోయ కులస్తులకు సైతం ఉపాధి లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఊరికే కల వచ్చింది.
– కొండపలుకుల ఉమాపతి రావు, రైతు, పోతారం
01