కరీంనగర్ జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన ఈ అవార్డులు దక్కాయి. స్వయం సమృద్ధిలో తిమ్మాపూర్ మండల కేంద్రం, క్లీన్ అండ్ గ్రీన్‌లో తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, నీటి సమృద్ధిలో రామడుగు మండలం వెలిచాల గ్రామాలు ఎంపికయ్యాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా తిమ్మాపూర్ సర్పంచ్ దుండ్ర నీలమ్మ, పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన పంచాయతీ కార్యదర్శులతో కలిసి అవార్డులు అందుకున్నారు.
-కరీంనగర్, మార్చి 31(నమస్తేతెలంగాణ)/ రామడుగు
కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన ఈ అవార్డులు దక్కాయి. స్వయం సమృద్ధిలో తిమ్మాపూర్ మండల కేంద్రం, క్లీన్ అండ్ గ్రీన్‌లో తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, నీటి సమృద్ధిలో రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ అవార్డులకు ఎంపికయ్యాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు అవార్డులను అందజేశారు.
ఈ మూడు పంచాయతీలను జాతీయ స్థాయిలో ఏప్రిల్ 24న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ అవార్డులకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాల్లో మండల, జిల్లా స్థాయిలో అధికారులతో ఏర్పడిన కమిటీలు ఆయా గ్రామాలను అవార్డులకు ఎంపిక చేశాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన గ్రామపంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు ఈనెల 27న మంత్రి గంగుల కమలాకర్ అవార్డులు ప్రదానం చేశారు. కాగా, వీటిని రాష్ట్ర స్థాయికి పంపించారు. రాష్ట్ర స్థాయిలో మూడు పంచాయతీలను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపించారు. అలాగే, వీటితోపాటు రాష్ట్రంలోని ఉత్తమ ప్రాంతీయ శిక్షణగా కేంద్రంగా హసన్పర్తికి అవార్డు దక్కింది. దీని పరిధిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విస్తరణ శిక్షణ కేంద్రాలు ఉంటాయి.
మంత్రి చేతుల మీదుగా అవార్డులు
రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డులను శుక్రవారం కేటీ రామారావు చేతుల మీదుగా ప్రదానం చేశారు. తిమ్మాపూర్ సర్పంచ్ దుండ్ర నీలమ్మ, కార్యదర్శి కోరుకంటి మహేందర్ రావు, పర్లపల్లి సర్పంచ్ మాదాటి భారతి, కార్యదర్శి పద్మావతి, వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన, కార్యదర్శి బండారి అరుణ్‌కుమార్ అవార్డులను అందుకున్నారు. మంత్రి కేటీఆర్ వీరికి అవార్డుతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన పంచాయతీలకు రూ. 20 లక్షలు, జిల్లా స్థాయిలో అవార్డులు పొందిన పంచాయతీలకు రూ. 10 లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో వీర బుచ్చయ్య, డీఆర్డీవో ఎల్ శ్రీలతా రెడ్డి, జిల్లా శిక్షణా కేంద్రాల మేనేజర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట సురెందర్ పాల్గొన్నారు.