కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసమే ప్రజా పాలన పేరిట గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమను ఫోన్లలో సంప్రదించవచ్చని సూచించారు. గ్రామ సభల్లో ఒక్క దరఖాస్తుదారు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఫారం ఉంటుందని, రేషన్ కార్డు ఉన్న వారు, లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రామ, బస్తీ సభల్లో వచ్చే దరఖాస్తుల ఆధారంగానే త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రజా పాలన గ్రామ సభల నిర్వహణపై బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులు, సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహిస్తున్నామని, సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు తీసుకుంటామని అన్నారు. అధికారులు ఎవరి పరిధిలో వారు చొరవ చూపాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ఎక్కువ మంది వచ్చినప్పుడు టోకెన్ సిస్టంలో దరఖాస్తులు స్వీకరించాలని, పెద్ద గ్రామాలు ఉంటే కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తమ పాలన అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, దీనిని పరిశీలించేందుకు ఈ నెల 29న తాము అక్కడికి వెళ్తామని చెప్పారు. రేషన్ బియ్యం కిలోకు 39 వెచ్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఉచితంగా అమలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 54 లక్షల కుటుంబాలకు కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం ఒక కిలో చొప్పున మరో 35 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నదన్నారు. అయితే రేషన్ బియ్యం ఎక్కువగా రైస్ మిల్లులో రీసైక్లింగ్ అవుతున్నదని, ఈ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నదని స్పష్టం చేశారు.
పేదలకు లబ్ధి చెందేలా మంచి పాలనను అందించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. కాగా, ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణపై కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తోపాటు మిగతా జిల్లాల కలెక్టర్లు మంత్రులకు ఈ సందర్భంగా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. గ్రామసభలు శాంతియుతంగా జరిగేందుకు తీసుకున్న చర్యలను ఆయా జిల్లాల పోలీస్ అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ (జగిత్యాల), డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్ (కోరుట్ల), మేడిపల్లి సత్యం (చొప్పదండి), డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూర్), పాడి కౌశ్క్ రెడ్డి (హుజూరాబాద్), చింతకుంట విజయరమణారావు (పెద్దపల్లి), మక్కాన్ సింగ్ ఠాకూర్ (రామగుండం) తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు కోసం మా ప్రభుత్వం సిటిజన్ చార్ట్‌ను రూపొందిస్తున్నది. అందుకోసం వివిధ సంఘాల నాయకులతో చర్చిస్తున్నాం. ఎన్నికల ముందు మేమిచ్చిన అభయ హస్తం హామీల్లో రెండింటినీ ఇప్పటికే అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇప్పటి వరకు 4 కోట్ల జీరో టికెట్లు ఇచ్చాం. అంటే 40 నుంచి 50 లక్షల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే ముందు పూర్తి డాటా కలెక్షన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రజా పాలన గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తున్నాం.
ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులు చిరునవ్వుతో దరఖాస్తులు చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపిస్తం. అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం. దరఖాస్తుల స్వీకరణ సమయంలో పోలీసులు చొరవ తీసుకుని ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మోడల్ అభివృద్ధి జరగాలి. అందుకోసం అధికారులు సలహాలు, సూచనలు చేయాలి. ఐదేళ్లలో అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. అధికారులు అందుకు సహకరించాలి.
– దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి
గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయనే నెపంతో అధికారులు ఒక్క దరఖాస్తు కూడా తిరస్కరించవద్దు. ప్రతి దరఖాస్తుపైనా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 7న మా ప్రభుత్వం అధికారం చేపట్టింది. రెండు రోజుల్లోనే మేమిచ్చిన హామీల్లో రెండింటినీ అమలు చేశాం. గ్రామసభల్లో స్వీకరించే దరఖాస్తుల ద్వారా మిగతా హామీలన్నింటినీ అమలు చేస్తాం. దరఖాస్తుదారులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా పాలనలో అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. అన్ని జిల్లాలకు కరీంనగర్ ఆదర్శంగా నిలువాలి.
– మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ