KTR | సిరిసిల్ల, మార్చి 13: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిని విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతి భవన్లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నసీర్ అల్మాలీతో సమావేశమై వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్‌కు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకట్, కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్, రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హనుమంతులు 2005లో నేపాల్‌కు చెందిన దల్ ప్రసాద్ రాయ్ మరణం కేసులో దుబాయ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.
యూఏఈ చట్టాలు(షరియా చట్టం) మేరకు రూ.15లక్షల పరిహారాన్ని బాధితుడి కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో స్వయంగా తాను నేపాల్‌కు వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు మంత్రి వివరించారు. షరియా చట్టంలోని (దియాహా) ప్రకారం బాధిత కుటుంబం (బ్లడ్ మనీ తీసుకొని) క్షమాపణ పత్రం అందిస్తేనే వీరిని విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలుసుకొని బాధితుడి కుటుంబంతో 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను తీసుకొని దుబాయ్ ప్రభుత్వానికి అందజేసినట్లు వివరించారు. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం చాలా పర్యాయాలు తానే స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా, యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీన్ రషీద్ అల్ ముక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని కేటీఆర్ వివరించారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా తన విజ్ఞప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపి దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు జిల్లా వాసులను వెంటనే స్వదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు.