ముస్తాబాద్, ఏప్రిల్ 11: మండలంలోని పోతుగల్లో ఆధునీకరించిన ఎస్సీ బాలుర హాస్టల్ సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి పాలనలో శిథిలమైన ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. మంత్రి కేటీఆర్ చొరవతో స్పెషల్ డెవలప్మెంట్ కింద మంజూరైన రూ. 18 లక్షలతో ఆధునీకరించింది. కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణలో విద్యార్థులకు అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించింది. వేడినీటి కోసం గీజర్, శుద్ధజలం కోసం ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి తెచ్చింది. వందలమంది ఒకేసారి కూర్చుని తినేలా డైనింగ్హాల్ను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీని ఏర్పాటు చేసింది. హాస్టల్ పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దింది. మైదానాన్ని ఆధునీకరించింది. ఇలా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న హాస్టల్ బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండగా, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. నిధులు మంజూరు చేయించిన అమాత్యుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.