సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్/ ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట, ఏప్రిల్ 10: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని 11 గ్రామా ల్లో కలియదిరిగారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు. అంబేద్కర్ లేకుంటే ఓ సామాన్య మహిళ సర్పంచ్ అయ్యేది కాదని, మంత్రిగా అం దరి ముందు మాట్లాడే అవకాశం తనకు దక్కేది కాదని చెప్పారు. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పెద్దోని అనుమతి లేకుండా చిన్నోడు వేరు పడవచ్చనే ఆలోచన చేయకపోతే జీవిత కాలంలో తెలంగాణ ఏర్పడేది కాదని గుర్తు చేశా రు.
‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే నినాదంతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం విగ్రహా లు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. తొ మ్మిదేండ్లలో రాష్ట్రంలో ఏమేం మార్పులు వచ్చా యో కండ్లముందు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రం రాకముందు ఊరిలో కరెంటు ఐదారు గంటలు కూడా సరిగా ఉండేది కాదని గుర్తు చేశారు. రైతు లు మొగులు దిక్కు జూసి వ్యవసాయం చేసేదని, నీళ్లు లేకపోడం, బోరు పనిజేయకపోవడం, మోట ర్ కరాబవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వం టివి నిత్యకృత్యంగా ఉండేవన్నారు. ఊళ్లో ఎవరైనా చనిపోతే సెస్ వాళ్లకు ఫోన్జేసి అద్దగంట కరెంటియ్యిమని బతిమిలాడిన రోజులు అందరికీ తెలిసిందేనన్నారు. ఒకప్పుడు రూ.200ల పెన్షన్‌కు గొప్పలు చెప్పుకున్నరని, ఇప్పుడు దివ్యాంగులకు రూ.3 వేలు, వృద్ధులతో పాటు ఇతర పెన్షన్లన్నీ రూ.2 వేలు ఇస్తున్నామని చెప్పారు.
ఎవరూ అడగకున్నా బీడీ కార్మికులకు సైతం పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశా రు. నాడు అంజుమన్ బ్యాంకులో అప్పుకు సం బంధించిన కిస్తీలు కట్టకపోతే దర్వాజలు ఎత్తుకుపోయిన చీకటి రోజులను మంత్రి గుర్తు చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒత్తిడి పెంచినా సీఎం కేసీఆర్ దానికి ససేమిరా అంటున్న విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని సౌలతులున్న గ్రామం ఎక్కడైనా ఉందంటే అది కేవలం తెలంగాణలో మాత్రమేనని, దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక జేస్తే అందులో 19 మ నదగ్గరే ఉన్నాయనే విషయాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పా రు.
ఇక్కడ పనిజేసేందుకు ఒడిశా, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారని, కానీ మనవాళ్లు ఊ ళ్లు విడిచి గల్ఫ్ దేశాలు పోవడం దురదృష్టకరమన్నారు. పైసలు కొన్ని తక్కువొచ్చినా భార్యాపిల్లలతో కలిసి ఊళ్లోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఊళ్లకు కొందరు నాయకులు వచ్చి కథలు చెబుతుంటారని, వారు ఊరికి ఏం చేశారో నిలదీయాలని పిలుపునిచ్చా రు. ఇక్కడున్న ఎంపీ బండి సంజయ్ ప్రధాని మో దీని దేవుడంటున్నారని, సిలిండర్ ధర రూ.1200 చేసినందుకా?, పెట్రోలు ధర రూ.110కి పెంచినందుకు దేవుడా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాల కోసం మసీదులు త వ్వుదామంటూ ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. నాలుగు మంచిపనులు చేసి ప్రజల మనసులు గెలవాలని హితవుపలికారు.
ఖలేజా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్
దళితబంధు వంటి పథకం అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ లాంటి ఖలేజా ఉన్న నాయకుడితోనే సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. సంపద సృష్టించి పేదలకు పంచుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు అంద ని ఇల్లు లేదని, గడప గడపకూ ఏదో ఒక రూపం లో పథకాలు, ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబాలకు సైతం పథకాలు అందిస్తున్నామని వివరించారు. సమైక్య రాష్ట్రంలో కరంటు ఉంటే వార్త అని, నేడు కరెంట్ పోతే వార్త అని సభనుద్దేశించి చెప్పారు. తెలంగాణ వస్తే అభివృద్ధి సాధ్యమనేది అందరి కండ్ల ఎదుట కనిపిస్తున్నదని చెప్పారు. సమైక్యపాలనలో చేయలేని పనులన్నీ ఇపుడు చేస్తున్నామని, అప్పటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నీటి సంపద పెంచేందుకు మూలవాగుపై 13, మానేర్ వాగుపై 11 చెక్‌డ్యాంలను నిర్మించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితబంధు అమలు చేస్తున్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని పునరుద్ఘాటించారు.
గోరంటాలను రూ.10 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం
గంభీరావుపేట మండలంలోని గోరంటాలను గత ఎనమిదేళ్లలో రూ.10 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేసుకుందామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014 కు ముందు గోరంటాల ఎలా ఉండేదని, ఇప్పుడు ఎలా ఉందని గ్రామస్తులకు గుర్తు చేశారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, పేదలకు కావాల్సిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎత్తిపోథల ద్వారా ఎర్రగుంట చెరువుకు కాళేశ్వర జలాలు తీసుకవచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలకు సైతం పథకాలు
నిత్యం తమను తిట్టిపోసే ప్రతిపక్షాలకు సైతం ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండబట్టే సంపద సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మసీదులు కూల్చడం, మత కలహాలు సృష్టించడం, పేపర్లు లీక్ చేయడం తప్ప బండి జిల్లాకు చేసిందేమిటని మండిపడ్డారు. ఎంపీగా బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించుకుంటే జిల్లాకు రైలుమార్గం త్వరగా వచ్చేదన్నారు. ఎస్సారార్ జలాశయం వద్ద 350 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్ పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని, 18 ఏండ్లు నిండిన యువతకు పరిహారం వచ్చేలా చూస్తానని మధ్యమానేరు ముంపు నిర్వాసితుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు..
దళిత బంధు పథకంతో అనూహ్య మార్పులు
సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి చెప్పారు. దళిత బంధు పథకంతో పేద దళితులలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద తీసుకున్న పైసలతో రైసుమిల్లులు, పౌల్ట్రీ ఫాంలు, సూపర్మార్కెట్లు, బ్రిక్స్ తయారీ లాంటి కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా దళిత కుటుంబాలు ఎదుగుతున్నట్లు చెప్పారు. దళితబంధు లాంటి పథకం పెట్టాలంటే ధైర్యం ఉండాలని, పేద ప్రజలపై మమకారంతో సాహసోపేతంగా శ్రీకారం చుట్టిన ఈపథకం సక్సెస్ పుల్గా అమలవుతున్నదని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండి మండుటెండల్లో మత్తుళ్లు దూకుతున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో ఒక మండెపల్లి గ్రామంలోనే యాసంగిలో 6.50 టన్నుల ధాన్యం సేకరిస్తే తెలంగాణ వచ్చినంక 23 టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ ఎన్ని రెట్లు పెరిగిందో ప్రజలే చూస్తున్నారన్నారు. ఈ అభివృద్ధిని చూస్తేనే తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందోనని కలగన్నామా? అని ప్రశ్నించారు.
మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటున్నందునే వ్యవసాయం, కరెంటు, గ్రామాలు బాగుపడుతున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో కరెంటు, నీళ్లు, రైతుకు పెట్టుబడి సాయం అందించడం వల్లే భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల, 3వేల మంది గిరిజనులను సర్పంచులుగా, 20వేల మందిని వార్డు మెంబర్లుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆరు శాతం రిజర్వేషన్లను పదిశాతానికి పెంచడం జరిగిందన్నారు.
అంధత్వాన్ని నివారించాలన్న ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాని మంజుల, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కు నాగరాజు, ఎల్లారెడ్డిపేట ఎం పీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, గం భీరావుపేట ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ కొలుముల అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.