హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను తేల్చి 42శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డిమాండ్ చేసింది. సర్కారు తక్షణమే స్పందించి, రెండో పీఆర్సీ కోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించాలని కోరింది. ఈ మేరకు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్‌తో కూడిన ప్రతినిధి బృందం బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ కే రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీ నివేదిక గడువు ముగిసి 22నెలలు దాటిందని, ఉద్యోగుల పిల్లల ఫీజులు, వైద్యఖర్చులు, ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారని వివరించారు.
సాధారణ బదిలీలు చేపట్టాలి
బదిలీలపై నిషేధం ఎత్తివేసి, వేసవి సెలవుల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. ఆరేండ్లుగా బదిలీల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కొన్ని శాఖల్లో ఆరేండ్లు, మరికొన్నిశాఖల్లో 13 ఏండ్లుగా ఒకే చోట ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరిని బదిలీచేయాలని కోరారు. గతంలో 40శాతం పరిమితి విధించడం, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా బదిలీలకు నోచుకోలేకపోయారని పేర్కొన్నారు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.