కొత్తపల్లి, అక్టోబర్ 18: జిల్లా కేంద్రంలోని రాంనగర్ మైదానంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మంత్రి కేటీఆర్ ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్‌రావు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, ఇతర నాయకులు హెలిప్యాడ్‌కు చేరుకొని కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌తో పాటు గంగుల కమలాకర్ ఓపెన్ టాప్ జీపులో హెలిప్యాడ్ నుంచి భారీ వాహన ర్యాలీతో రాంనగర్‌లోని సభ వేదికకు చేరుకున్నారు. ర్యాలీలో సుమారు 5 వేల మంది కార్యకర్తలు, అభిమానులు ప్రాంతీయ క్రీడా పాఠశాల నుంచి బైపాస్ రోడ్డు మీదుగా జై జై కేటీఆర్… జై జై గంగుల అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. సభా ప్రాంగణానికి వాహన శ్రేణి చేరుకునేందుకు సుమారు గంటకు పైగా సమయం పట్టింది. కేటీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్లు తదితరులున్నారు.
గంగుల హరిహరన్, ప్రదీప్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 18: ప్రజా ఆశీర్వద సభకు జీకే యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగుల ప్రదీప్, యువ నాయకుడు గంగుల హరిహరన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత తరలివెళ్లి, మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రతి వార్డు నుంచి వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై యువకులు తెలంగాణచౌక్కు చేరుకుని, అక్కడిన ఉంచి హెలిప్యాడ్ మైదానానికి వెళ్లారు. మంత్రి కేటీఆర్ వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో యువత అంతా సభాస్థలం వరకు ద్విచక్ర వాహనాలపై ఆయనకు స్వాగతం పలుకుతూ ర్యాలీగా తరలివచ్చారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 18: ప్రజా ఆశీర్వాద సభకు కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యక్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు వాహనాలు ఏర్పాటు చేయగా వెళ్లారు.
ప్రజా ఆశీర్వాద సభ సైడ్‌లైట్స్
కార్పొరేషన్/కలెక్టరేట్/తెలంగాణ చౌక్, అక్టోబర్ 18: నగరంలోని 60 డివిజన్ల నుంచి యువకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా సభ వేదికకు చేరుకున్నారు.