రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరినీ ఆశీర్వదిస్తే ఇప్పటివరకు పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒకవైపు, రాబోయే ఐదేళ్లలో జరిగే అభివృద్ధి ఒకవైపు ఉంటుందని చెప్పారు. ప్రజలు ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలకు ఆగం కావద్దని, అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. ఆదివారం ఆయన గోదావరిఖనిలో ‘రామగుండం దశాబ్ది ప్రగతి సభ’, పెద్దపల్లిలో ‘ప్రగతి నివేదన సభ’కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయాచోట్ల ప్రసంగించారు.
ఓవైపు కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగడుతూనే.. మరోవైపు స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. చందర్‌కు పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే, నియోజకవర్గాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుంటానని, మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అసలు సిసలైన బీఆర్ఎస్ బిడ్డా మనోహర్‌రెడ్డిని 50వేల నుంచి 60వేల భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. – పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)
మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలి
ఉమ్మడి పాలనలో వేసిన వరిపంట చేతికివచ్చేదాకా ఎదురుచూసే పరిస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దీని నుంచి కాకతీయ కెనాల్‌కు లింక్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్దపల్లి, మంథని, ధర్మపురి ఏరియాల్లో ఎక్కడా చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. నడి ఎండల్లోనూ చెరువులు, కుంటలు నిండుగా కనిపిస్తున్నాయి. రెండు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో రైతాంగం సంతోషంగా ఉన్నది. సంక్షేమ పథకాల అమలుతో నిరుపేదలు నిశ్చింతగా బతుకుతున్నారు. సబ్బండ వర్గాల కోసం మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలి. పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలుగా మంచి పేరున్న దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– పెద్దపల్లి, గోదావరిఖని సభల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్
కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేద్దాం
కాలనాగు లాంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జేసింది? పంట పెట్టుబడికి రైతుబంధు ఇచ్చిందా..? వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిందా..? మడులు తడిచేలా నీరందించిందా..? మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఇచ్చిందా..? ప్రజలు ఆలోచించాలి. కానీ, అభివృద్ధి చేసేది, అన్ని వర్గాలకు మేలు చేసేది బీఆర్ఎస్ సర్కారే. తెలంగాణ రాకముందు 85 వేల ఎకరాల్లో వరి పంట వేసేది. 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చేది. స్వరాష్ట్రంలో 2.12 లక్షల ఎకరాల్లో 4 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ఈ రోజు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా 150 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉన్నది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న మరోసారి ఆశీర్వదించండి. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చేయండి.
-పెద్దపల్లి ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
మరోసారి ఆశీర్వదించండి
కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. యువతరానికి నడకలు నేర్పి ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులను మంజూరీ చేసిన మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వడం నిజంగా రామగుండం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి. మీ బిడ్డనైన నన్ను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్త.
– రామగుండం దశాబ్ది ప్రగతి సభలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పెద్దపల్లి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి రూరల్ : రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను, పెద్దపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘రామగుండం దశాబ్ది ప్రగతి సభ’, ‘పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ‘ప్రగతి నివేదన సభ’లకు అమాత్యుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఒకవైపు రెండునియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. సింగరేణితోపాటు రాష్ర్టానికి ప్రధాని చేసిన మోసాలను వివరిస్తూనే.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకు అండగా నిలబడిన కేసీఆర్‌కు మించి ఎవరైనా ఉన్నారా చూపించాలంటూ సవాల్ విసరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారంటీల గురించి కథల రూపంలో వివరించి.. ప్రజలను అకట్టుకున్నారు. ప్రతిపక్షాలకు తప్పిపోయి ఓటేస్తే వారి పాలన ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. రామగుండంలో కోరుకంటి చందర్‌ను పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని చెప్పిన ఆయన, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని 50వేల నుంచి 60 వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రామగుండంను దత్తత తీసుకుంటా..
స్వరాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటివరకు పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒకవైపు, మళ్లీ రాబోయే ఐదేళ్లలో జరిగే అభివృద్ధి ఒకవైపు ఉంటుందని చెప్పారు. ఇది కావాలంటే రామగుండం నియోజవర్గాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుంటామని ప్రకటించారు. ఇదే సమయంలో మంత్రి ఓ కండీషన్ పెట్టారు. పెద్దపల్లి జిల్లాలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్కన్నా అత్యధిక మెజార్టీనిచ్చి కోరుకంటి చందర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అప్పుడు స్వయంగా దత్తత తీసుకొని.. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నిజానికి స్వరాష్ట్రంలో సింగరేణి అభివృద్ధిలో దూసుకెళ్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు అండగా నిలిచిన తీరును ఈసందర్బంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భావం నుంచి, అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బాసటగా నిలిచారని కొనియాడారు. నల్లసూరీళ్లు జంగ్‌సైరన్ ఇస్తే.. దెబ్బకు కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్లు దిగొచ్చారని గుర్తు చేశారు. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు అడిగే సమయంలో రామగుండంకు ఏకంగా మెడికల్ కళాశాలనే ఇచ్చామని, నర్సింగ్ కళాశాల ఇవ్వడం పెద్ద లెక్క కాదని, కార్మికుల బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు.
అందుకే సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్‌ను కల్పించామని చెప్పారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సింగరేణి 419కోట్ల లాభాల్లో ఉంటే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో నేడు 2,222కోట్ల లాభాల బాటలో పయనిస్తున్నదని నాడు 18శాతం ఉన్న లాభాల వాటా నేడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32శాతం ఇచ్చామన్నారు.
దీపావళి బోనస్ ఒకే ఏడాదిలో 1000కోట్లు జమ చేస్తున్న ఘనత మనకే దక్కుతుందన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎన్ని చిక్కులు వచ్చినా ఒకే ఒక్క సంతకంతో 3200 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో ఇప్పటి వరకు 15400 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 500 మందికి డిస్మిస్డ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మహిళా కార్మిలకు 3నెలల మెటర్నిటీ లీవులను 6నెలలకు పెంచామని, 2సంవత్సరాల వరకు చైల్డ్ కేర్ లీవును ఇచ్చామని చెప్పి కోల్‌బెల్ట్ ప్రజల హార్ట్ టచ్ చేశారు.
కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోకపట్టుకొని గోదావరి ఈదినట్టేనన్నారు. ఎడారిలా ఉన్న గోదావరిఖని గోదావరిని నిండుకుండలా అద్భుతాలను చేసిన సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల సేవనే ఆకాంక్షించే ఎమ్మెల్యే చందర్ ఉన్నారని, రాబోయే ఐదేళ్లల్లో అద్భుతమైన ప్రగతిని చేసుకుందామన్నారు. ప్రజలు ప్రతిపక్షాలు చెప్పే మాటలకు ఆగం కావద్దని అభివృద్ధిలో భాగం కావాలన్నారు.
60 వేల మెజార్టీతో మనోహర్‌రెడ్డిని గెలిపించాలి
ఒకవైపు పెద్దపల్లి నియోజకవర్గంపై అభివృద్ధి వరాల జల్లు కురిపించిన కేటీఆర్, మరోవైపు అనేక అంశాల్లో ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ అసలు సిసలైన బీఆర్ఎస్ బిడ్డా మన మనోహర్‌రెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు. మనోహర్‌రెడ్డిని 50వేల నుంచి 60వేల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అడిగిన ప్రతి డిమాండ్‌ను పరిష్కరిస్తున్నామన్నారు. ఇంకా కొన్ని కోరికలు కోరారని, జిల్లాను ఏర్పాటుచేసిన తమకు.. ఈ చిన్న చిన్న పంచాయతీలు ఏర్పాటుచేయడం కష్టం కాదన్నారు.
పెద్దపల్లి మరింత ప్రగతి సాధించాలంటే.. మనోహర్‌రెడ్డిని గెలిపించి చూపించాలన్నారు. పెద్దపల్లిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని, అందుకే ఎవరూ అడుగకపోయినా.. దరఖాస్తు ఇవ్వకపోయినా జిల్లాకేంద్రాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. జిల్లా చేసిన కేసీఆర్ మీరు అడిగే కొత్తమండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు పెద్ద లెక్క కాదన్నారు. మనోహర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే.. పెద్దపల్లికి బస్సు డిపో, కొత్తమండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు నడిచి వస్తాయన్నారు. అలాగే మరో 25 నుంచి 50కోట్లను కేటాయించి అభివృద్ధి చేస్తామంటూ వరాల జల్లు కురిపించారు.
రాబోయే ఎన్నికల్లో దాసరి మనోహర్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ను కాళ్లు పట్టుకోనైనా అడిగి మీరడిగిన కోరికలన్నీ సాధించుకుంటామని హామీ ఇచ్చారు. 150 ఏళ్ల ముసలి పార్టీ కాంగ్రెస్‌కు వారంటీ గ్యారంటీలు లేవని కాలం చెల్లిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లిలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే అంత్యక్రియలకు వెళ్తే.. స్నానం చేసేందుకు 10నిమిషాలు కరెంటు ఇవ్వాలని బతిమాలిన రోజులను గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా పుష్కలంగా విద్యుత్, నీళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యవసాయ ఆధారిత పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల సాగునీటి కష్టాలు తీర్చామన్నారు. నియోజకవర్గంలో 85వేల మంది రైతులకు 73వేల కోట్ల రైతు బంధు సాయం అందిస్తున్నామని, రైతు బీమా ద్వారా 1046మందికి 52.30కోట్లు ఇచ్చామన్నారు. కరోనా కష్టకాలంలో సైతం 37వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. కొలనూరు, గర్రెపల్లి మండలాలు, పెద్దపల్లి అర్భన్, రూరల్ మండలాలు, రంగాపూర్ గ్రామం నుంచి శ్రీరాంనగర్ గ్రామ పంచాయతీ, ఊషన్నపల్లి నుంచి మరో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తామన్నారు. మనోహరన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Eswar
రామగుండంపై అమితమైన ప్రేమ
కార్మిక క్షేత్రమైన రామగుండంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అమితమైన ప్రేమ ఉన్నది. ఒకప్పటి జనగామ గ్రామం నుంచి గోదావరిఖని పట్టణం, ప్రఖ్యాతిగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని మమకారం చూపుతున్నది. ఇక్కడ ఐటీపార్కు, మెడికల్ కళాశాల రావడం ఎవరూ ఊహించలేనిది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హయాంలో రూ.450 కోట్ల డీఎఫ్ఐటీ నిధులతో అనేక అభివృద్ధి పనులు జరిగాయి.
ఉద్యమాల నిలయంలోని మట్టి బిడ్డ కోరుకంటి చందర్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్ వెంట నడిచారు. ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేటీఆర్‌కు మమకారం ఎక్కువ. అందుకే కార్మిక క్షేత్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి జరుగుతుంది. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్మిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఏసీ వసతి కల్పించారు. రాబోయే ఎన్నికల్లో కోరుకంటి చందర్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి.
-రామగుండం దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్
మరోసారి నన్ను ఆశీర్వదించండి
కేటీఆర్ ఈ ప్రాంతంపై చూపుతున్న ప్రేమాభిమానాలను చూసి చాలా సంతోషపడుతున్నాం. రాముడికి హనుమంతుడు ఎలా బంటులా ఉన్నాడో.. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజలకు కేటీఆర్ సహకారంతో ప్రజలకే ఈ జీవితాన్ని అంకితం చేస్తా. ఒక కుగ్రామం జనగామ అడ్డగుంటగా ఉండే రామగుండం నియోజకవర్గ కేంద్రం గోదావరిఖని దశాబ్ది కాల అభివృద్ధితో ఏ విధమైన ప్రగతి జరిగిందో ప్రజలే స్వయంగా చూశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హయాంలో జరిగింది.
కనీసం కాలేజీలు లేని ఇక్కడికి మెడికల్ కళాశాలను ఇచ్చారు. రిజిస్ట్రేషన్లకు పడ్డ తిప్పలను దూరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, కోర్టు కేసుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించుకున్నాం. కలియుగ రాముడు కేటీఆర్ చేతుల మీదుగా ఖురూజ్ కమ్మీ పట్టాలు, ఐటీ, ఇండస్ట్రియల్ పార్క్‌లకు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా రామగుండం ప్రజల అదృష్టం. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదిరించాలి. మీ బిడ్డనైన నన్ను ఆశీర్వదించి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి.
– రామగుండం దశాబ్ది ప్రగతి సభలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కేసీఆర్, కేటీఆర్‌తోనే నిజమైన అభివృద్ధి
రాష్ట్రం, రామగుండం నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనే సాధ్యం. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విధంగానే రామగుండం నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే నేను బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నా. సాంస్కృతిక, చారిత్రాత్మక తెలంగాణ తన ఔన్నత్యాన్ని బీఆర్ఎస్ పాలనలో కాపాడుకున్నది. హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యమైన పట్టణం రామగుండం.
ఇక్కడి నుంచే ఈ దేశానికి వెలుగులు, ఎరువులు, నీళ్లు అందుతున్నాయి. అలాంటి రామగుండంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నా. సింగరేణి ద్వారా పవర్ హౌస్, ఇంకా ఎన్టీపీసీలో 2400ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయించాలి. బీ పవర్‌హౌజ్‌ను పునరుద్దరించాలి. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రామగుండంను ఇండస్ట్రియల్ జోన్‌గా ప్రకటించి మోడల్‌గా మరింత అభివృద్ధి చేయాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలు అసలైన అభివృద్ధి, సంక్షేమం కోసం రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి చందర్‌ను గెలిపించి మూడో మారు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
-రామగుండం దశాబ్ది ప్రగతి సభలో కార్మిక నేత కౌశికహరి
గులాబీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
తెలంగాణ సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇదంతా మీ కండ్ల ముందరే కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు మేలు చేశారు. రాష్ర్టాన్ని అన్నింటా ముందునిలిపారు. మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు. ఐటీ రంగాన్ని విస్తరించారు. ఈ సెక్టార్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయన పాలనాదక్షతతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఇందుకు గులాబీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకోవడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం .
-పెద్దపల్లి ప్రగతి నివేదన సభలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
గుంట నక్కలతో అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికలు వస్తున్నాయంగానే కాంగ్రెస్, బీజేపీ రూపంలో గుంట నక్కలు బయల్దేరినయ్. మిమ్మల్ని మోసం చేసేందుకు వస్తున్నయ్. వీరి కుప్పిగంతులన్నీ మన సింహం బయటకు వచ్చేంతవరకే. మన నాయకుడు సీఎం కేసీఆర్ ఎన్నికల రణక్షేత్రంలోకి వస్తే ఆ రెండు పార్టీలకు దబిడి దిబిడే. వారంతా కట్టగట్టుకొని పారిపోవాల్సిందే. ఇలాంటి నాయకులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఇక్కడి ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే ఎన్నో మంచి పనులు చేశారు. మళ్లీ ఆదరిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారు. పెద్దపల్లిలో ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, పార్కుల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ కు నిధులివ్వాలని విజ్ఞప్తి చేస్తున్న. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు దాసరి మనోహర్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించి కేటీఆర్‌కు కానుక ఇవ్వాలె.
– పెద్దపల్లి ప్రగతి నివేదన సభలో మండలి చీఫ్ విప్ టీ భానుప్రసాద్‌రావు