ధర్మారం, జూలై 10: అన్ని కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేస్తున్నదని స్పష్టం చేశారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం, దొంగతుర్తి, రచ్చపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో మంత్రి సోమవారం పర్యటించారు. నంది మేడారంలో రెండో విడుత 24 యూనిట్ల గొర్రెలను గొల్ల, కుర్మలకు పంపిణీ చేశారు. అదే గ్రామంలో 50 లక్షల వ్యయంతో నిర్మించే సైడ్ లైటింగ్ సిస్టం పనులను ప్రారంభించారు. ఆ తర్వాత దొంగతుర్తిలో దొంగతుర్తి -కుమ్మరికుంట గ్రామాల మధ్య 4 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పలు సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇంకా దొంగతుర్తి, రచ్చపల్లి, రామయ్యపల్లి గ్రామాల్లో జీపీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిమేడారంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గొల్ల, కురుమల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, మొదటి విడుతలో 40 లక్షల గొర్రెల యూనిట్లను అందించిందని చెప్పారు. ఇటీవలే రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించిందని, మరో 40 లక్షల మందికి అందిస్తామని ఆయన వెల్లడించారు. విడుతలవారీగా గొర్రెలు పంపిణీ చేస్తామని, పెంపకం దారులు ఆందోళన చెందవద్దని సూచించారు. కోట్లాది రూపాయలతో నందిమేడారం గ్రామాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.
గ్రామంలో నంది రిజర్వాయర్ నిర్మించడంతో పంట పొలాలకు పుషలంగా సాగునీరు అందుతున్నదన్నారు. పాత పెద్దచెరువు శిఖం స్థలాన్ని చదును చేయించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయించడంతో గ్రామానికి కొత్త శోభ వచ్చిందని గుర్తు చేశారు. గ్రామంలో 30 పడకల దవాఖాన నిర్మాణమవుతున్నదని, ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలువాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యాదవులు గొర్రె పిల్లను బహూకరించి, మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సామంతల జానకి, ముత్యాల చంద్రశేఖర్, రేగుల సదన్ బాబు, మోర సుధాకర్, ఎంపీటీసీ లు మిట్ట తిరుపతి, దాడి సదయ్య, బెల్లాల రోజారాణి, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, ఏఎంసీ, విండో వైస్ చైర్మన్లు చొప్పరి చం ద్రయ్య, సామంతుల రాజమల్లు, జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ సలా మొద్దీన్, ఎండీ రఫీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఊకంటి రవీందర్ రెడ్డి, నంది మేడారం వీఎల్వో శంకర్, పీఆర్ డీఈఈ శంకరయ్య, ఏఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.