వెల్గటూర్, నవంబర్ 17: “నేను మీ సేవకుడిని. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మీ వెంటే ఉంటా. మీ కోసమే పనిచేస్తా. నాయకుడిగా కాకుండా మీలో ఒకడిగా పని చేస్తా. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా” అని ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వానికే మద్దతు పలుకాలని, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు విని గోస పడవద్దని సూచించారు. ఈ రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేయలేదని, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు గ్రామాలమీద పడి తిరుగుతున్నారన్నారు. ఏండ్లకొద్ది పాలించి పనులు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా.. ఒకసారి ఆలోచించాలని, మీ ఇంటికి వచ్చే నాయకులను నిలదీయాలని సూచించారు. మళ్లీ వారు అధికారంలోకి వస్తే పైరవీలు, గుండాగిరి, దాదాగిరీలు రాజ్యమేలుతాయని మండిపడ్డారు.
శుక్రవారం ఎండపల్లి మండలం పాతగూడూర్, శానబండ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. మాయమాటలు, ఆరు గ్యారంటీలంటూ ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చే కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే మోసపోయి గోసపడుతామని, రాష్ట్రం మరో 50 ఏండ్లు వెనక్కిపోతుందన్నారు. ఆ పార్టీలోని నేతలు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోరని ఎద్దేవా చేశారు. వ్యవసాయం, విద్యుత్‌పైనా అవగాహన లేని రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని మాట్లాడడం చూస్తుంటే ఆయన మతిపోయినట్లుగా అనిపిస్తున్నదన్నారు. అభివృద్ధి అంటే కేరాఫ్ తెలంగాణ అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నోఏండ్లుగా దళితులను ఓటు బ్యాంక్‌గా చూశాయే తప్ప, ఏనాడూ వారి అభ్యున్నతికి చొరవ చూపలేదని, గుర్తింపు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని తెచ్చి రూ.10 లక్షలు అందజేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే హుజూరాబాద్ తరహాలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, కచ్చితంగా ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, వైస్ ఎంపీపీ ముస్కు కవిత, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్‌లు మారం జలేందర్‌రెడ్డి, బిటుకు పద్మ, బోడకుంటి రమేశ్, గంగుల నాగేశ్, కొప్పుల విద్యాసాగర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహచలం జగన్, నాయకులు పోనుగోటి రామ్మోహన్రావు, గంగుల అశోక్, చుక్క శంకర్రావు, గాజుల మల్లేశం, గూడ రాంరెడ్డి, గండ్ర విష్ణువర్దన్‌రావు, గండ్ర నర్సింగరావు, కొంగల చంద్రారెడ్డి, వుస్కమల్ల పరందాములు, తంగళ్లపల్లి చకప్రాణి, కంది విష్ణు, గాగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, హనుమంత్‌రావు, యుగందర్‌రావు, వేణుగోపాల్‌రావు, పడిదం మొగిళి, జుపాక కుమార్, తిరుపతి, నారాయణ, రియాజ్, మల్లేశ్, జీరెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గాదం భాస్కర్, వెంకటేశ్, సతీశ్, సత్యం, నర్సయ్య తదితరులు ఉన్నారు.