కార్పొరేషన్, ఫిబ్రవరి 22: సమైక్య పాలనలో ఆలయాలు నిరాదరణకు గురయ్యాయని, స్వరాష్ట్రంలో అలాంటి ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునరుద్ధరిస్తున్నామని, కరీంనగర్‌లోని రేకుర్తి గుట్టపైన ఉన్న లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కరీంనగరంలోని రేకుర్తి గుట్టపై నర్సింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అవాంతరాలను అధిగమించి పురాతనమైన ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 కోట్ల మేర నిధులు ఇచ్చామని, ఇంకా ఎన్ని నిధులైనా వెచ్చించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఎంతో మహిమ ఉన్న నర్సింహస్వామిని భక్తులందరూ సులువుగా దర్శించుకునేలా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఈ గుట్టపైకి వచ్చేందుకు మెట్ల దారి కూడా లేదని, ఇప్పుడు నేరుగా గుట్టపైకి వెళ్లేలా రోడ్డును అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ నెల 24న ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా గడప (దర్వాజ) పెడుతున్నామని వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. శంఖు, చక్రాలతోపాటు సుదర్శనచక్రం ఉన్న నర్సింహస్వామి ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదని, అభివృద్ధి పనులు పూర్తయితే ఈ దేవాలయానికి ఎంతో గుర్తింపు రావడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, స్థానిక కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కార్పొరేటర్లు రాజేందర్రావు, గుగ్గిళ్ల జయశ్రీ, రాములు తదితరులు పాల్గొన్నారు.