కరీంనగర్ రూరల్, నవంబర్ 20 : యాభై ఏండ్ల పాటు పరిపాలించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన దరిద్రమైన కాగ్రెస్ కావాలా?.. పదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ మండలంలోని గోపాల్పూర్, ఎలబోతారం గ్రామాలతో పాటు సాయంత్రం నగరంలోని పలు 47, 31, 50, 10 డివిజన్లలో ప్రచారం చేశారు. కరీంనగర్ మండలంలోని గోపాల్పూర్, ఎలభోతారంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒగ్గు డోళ్లు, కళాకారుల డప్పుచప్పుళ్ల మధ్య స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
మహిళలు గంగులకు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. గొంగలి కప్పి గజమాలలతో సన్మానించారు. ఈసందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పి, దవాఖానల్లో డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్టు బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచిన ఆయన నాలుగున్నరేళ్లు పత్తాలేకుండా పోయారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏం అభివృద్ధి చేశాడో గ్రామాల్లో మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు వస్తున్నాడని ఆరోపించారు. ఎంపీగా టికెట్ ఇవ్వమని చెబితే, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్క ఓటుకు మొబైల్, డబ్బు ఇస్తానని వస్తున్నాడని తెలిపారు. ఆనాడు తెలంగాణను అన్యాయంగా ఆంధ్రాలో కలిపింది బీజేపీ, కాంగ్రెస్‌లేనని దుయ్యబట్టారు. పచ్చని తెలంగాణపై ఆంధ్రోళ్ల కన్ను పడిందిని, మరోసారి తెలంగాణపై ఆధిపత్యం కోసం కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, పదేళ్ల అభివృద్ధిపై గ్రామాల్లో చర్చించాలని కోరారు.
ప్రతిపక్ష నాయకులు కేవలం ఎన్నికలప్పుడూ మాత్రమే కనిపిస్తారని, ఓటేయించుకొని మాయమవడం తప్పా.. వారు చేసిందేమీ లేదన్నారు. తాను ఎల్లప్పుడూ మీ కళ్ల ముందే ఉంటూ.. మీకు ఆపదలో అండగా ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న తరువాతే గ్రామాల రూపురేఖలు మారాయని, కోట్లాది రూపాయల నిధులతో గ్రామీణా రహదారులన్నీ పూర్తిగా అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తాను గెలిచిన తరువాత నగునూర్, ఎలభోతారం, ఇరుకుల్ల, చామనపల్లి, జూబ్లినగర్‌లో రోడ్లు వేశానని, అంతర్గత రహదారులను కూడా పూర్తి చేశానని తెలిపారు. మన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్కు ఓటు వేసి, కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని కోరారు.
కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి, తనను మరోసారి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచులు కట్ల లక్ష్మి, ఊరడి మంజుల, వైస్ ఎంపీపీ వెల్పుల నారాయణ, ఎంపీటీసీ చల్ల రామక్క, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ గోనే నర్సయ్య, నాయకులు మంద రాజమల్లు, ఆరె శ్రీకాంత్, కట్ల సంజీవరెడ్డి, చల్ల లింగారెడ్డి, దాది సుధాకర్, సుంకిశాల సంపత్‌రావు, మంద తిరుపతి, ముస్కు మల్లారెడ్డి, రమేశ్, వోల్లల సుదర్శన్, సుధాకర్, లక్ష్మారెడ్డి, బుచ్చాల కొమురయ్య, పెద్ది రమేశ్, మధుకర్, దావు సంపత్, నెక్ పాషా, వరి భద్రయ్య, గర్వంధ శ్రీనివాస్ పాల్గొన్నారు.