భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూనే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారితోపాటు లోతట్టు, ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జమ్మికుంట మండలం వావిలాల వద్ద మానేరు వరదలో చిక్కుకున్న 80 మంది జార్ఖండ్, బిహార్ కూలీలను తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలాగే మంథని మండలం గోపాల్పూర్ వాగులో చిక్కుకున్న 19 మందిని రెస్క్యూటీం సహాయంతో బయటికి తీసుకొచ్చారు. భారీ వర్షాలపై కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్షించి, ఎల్ఎండీ గేట్లను ఎత్తారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ తమ నియోజకవర్గాల్లో పర్యటించారు. గోదావరి నది నీటి మట్టం పెరగడంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించి వెల్గటూర్ మండలం చెక్‌డ్యాం పరిసర ప్రాంతాలు, ధర్మపురి పట్టణంలోని కొన్ని కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. సిరిసిల్లలోని నీటమునిగిన పలు కాలనీల ప్రజలను మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జగిత్యాలలోని పలు కాలనీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని జలాశయాలు, చెరువులు నిండుకులా మారాయి. రోడ్లపై వరద ఉప్పొంగుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాతోపాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. రెండు రోజుల నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలు ఇంకా కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి.
– మంత్రి గంగుల కమలాకర్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
– ప్రగతి భవన్ నుంచి కరీంనగర్ కలెక్టర్, సీపీ, ప్రజాప్రతినిధులకు వినోద్‌కుమార్ సూచన
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ వర్షాన్ని సైతం లేక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాకలు తరలించారు. ప్రజల మధ్యనే ఉండి సేవలందిస్తున్నారు
– కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ)
జమ్మికుంట మండలం వావిలాలలో హైటెన్షన్ విద్యుత్ టవర్లు నిర్మించేందుకు వచ్చిన జార్ఖండ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన 80 మంది కూలీలను రక్షించారు. హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్, జమ్మికుంట తహసీల్దర్ రాజేశ్వరి, వావిలాల ఎంపీటీసీ సభ్యులు మల్లేశం, తదితరులు ఈ కూలీలను తాళ్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
గన్నేరువరం మండల కేంద్రంలో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని స్థానిక ఎస్ఐ నర్సింహారావు తన వాహనంతో దవాఖానకు తరలించారు.
కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్కషాపు వద్ద జగిత్యాల రహదారిపై పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తున్న కారణంగా నగర పోలీసులు వాహనాలను దారి మళ్లించి పరిస్థితిని పర్యవేక్షించారు.
ఎల్ఎండీ జలాశయంలో గంట గంటకూ నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఎస్ఈ శివకుమార్ తమ అధికారులతో డ్యాంపైనే ఉండి పర్యవేక్షించారు. ఏక్షణంలోనైనా డ్యాం గేట్లను ఎత్తే అవకాశం ఉంటుందని దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ వర్షాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశా నిర్ధేశం చేయగా, కలెక్టర్ బీ గోపీ పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షించారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించి వర్షం, వరద పరిస్థితులను పర్యవేక్షించారు.
హుజూరాబాద్‌లో పట్టణంలోని గుండ్ల చెరువు ప్రమాద స్థాయికి చేరడంతో ముందు భాగంలో ఎక్స్కవెయిటర్తో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, కమిషనర్ సమ్మయ్య గండి కొట్టించారు.
శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు కట్ట దిగువన భారీ బుంగ పడడంతో గద్దపాక, కల్వలకు చెందిన మత్స్యకారులు గుర్తించి, పోలీసులు, అధికారులకు తెలుపగా సీఐ సంతోష్‌కుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డి సిబ్బందితో చేరుకుని జేసీబీ, ట్రాక్టర్లతో ఇసుక బస్తాలు తెప్పించారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, ఎస్సారెస్పీ, రెవెన్యూ, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బుంగను పూడ్చివేశారు.
కరీంనగర్ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులను పాక్షికంగా రద్దు చేశారు. వరంగల్ వెళ్లే బస్సులను హుజూరాబాద్ వరకు, నిజామాబాద్ వెళ్లే బస్సులను మెట్పల్లి వరకు నడిపించారు. జమ్మికుంట, గన్నేరువరం, ఇల్లంతకుంట, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామడుగు, జూలపల్లి, పెద్దాపూర్ మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు రద్దు చేశారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూం
1800425473
కరీంనగర్ మున్సిపల్
9849906694
వైద్య ఆరోగ్య శాఖ
9849902501