కార్పొరేషన్, ఫిబ్రవరి 21: కరీంనగర్‌ను సుంద ర నగరంగా తీర్చిదిద్దుతానని, 13 కూడళ్లలో అదిరిపోయేలా అధునాతన ఐలాండ్లు నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. విరివిగా నిధులు మంజూరు చేయిస్తూ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు చౌరస్తాలో చేపట్టనున్న ఐలాండ్ సుందరీకరణ పనులకు మంగళవారం మంత్రి భూమిపూజ చేశారు.
అనంతరం డిజైన్లను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.2.68 కోట్లతో కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా మానకొండూర్ రోడ్డులో నాలుగు చౌరస్తాల్లో అత్యంత సుందరం గా ఐలాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో హౌసింగ్‌బోర్డు చౌరస్తా, రాజీవ్ రహదారి వద్ద, సదాశివపల్లి వైపు బ్రిడ్జి దిగిన తర్వాత ఒకటి, మానకొండూర్ రోడ్డు వద్ద మరొకటి చౌరస్తాలను అభివృద్ధి చేస్తామన్నారు. 13 ఐలాండ్లలో ఏడింటికి టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించామని, మరో 6 ఐలాండ్స్కు టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 31 లోగా పనులు మొదలు పెడతామని చెప్పారు.
కేబుల్ బ్రిడ్జి ప్రారంభమయ్యేలోగా పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వేలాదికోట్లు విడుదల చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పటిష్టమైన భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు చురు గ్గా సాగుతున్నాయని, సదాశివపల్లి వైపు అప్రోచ్ రోడ్డు బీటీ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, ఆకుల ప్రకాశ్, షరోద్దీన్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
370 మంది.. 3.70 కోట్ల చెక్కులు
దేశంలో ఎకడా లేని విధంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గంలోని 370 మంది లబ్ధిదారులకు 3.70 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.