కార్పొరేషన్, నవంబర్ 21: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా అభివృద్ధి, సంక్షేమంపైనే ఉందని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు కరీంనగర్ అభివృద్ధిపై ఏమాత్రం కూడా పట్టింపు లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. నగరంలో సాగుతున్న అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. 2015లో సీఎం కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ వల్లే కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా వచ్చిందన్నారు. అప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్‌గానే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నగరంలో సాగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం నుంచి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనుల్లో కేంద్రం నుంచి నయా పైస భాగస్వామ్యం లేదన్నారు. నగరంలో సాగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా రూ.350 కోట్ల సీఎం అస్యూరెన్స్‌తో నిధులతోనేని తెలిపారు. స్మార్ట్సిటీలోనూ రాష్ట్రం వాటా నిధులను ఇచ్చిందన్నారు. ఎంపీగా గెలిచిన నాలుగున్నర ఏళ్లు అవుతున్న నియోజకవర్గ అభివృద్దికి ఒక్క పైస తీసుకురాని బండి సంజయ్ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్రం నుంచి రూ.వేల కోట్ల నిధులు తీసుకువచ్చి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో గొప్ప నగరంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ఈ అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయన్నారు. వారు ఏ రోజు కూడా అభివృద్ధిపై ఆలోచన చేయరని విమర్శించారు. వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్న బీఆర్ఎస్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించండి: వినోద్‌కుమార్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రజలను కోరారు. అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అభివృద్ధిలో సాగుతున్న రాష్ర్టాన్ని ప్రతిపక్షాల చేతుల్లో పెడితే ఇబ్బందుల పాలు అవుతామన్నారు. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న గంగులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్మార్ట్‌సిటీని తాము తీసుకువస్తే తప్పుడు ప్రచారాలతో ఎంపీ బండి సంజయ్ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు డి. శ్రీధర్, ప్రశాంత్, వాకర్స్ అసోసియేషన్ నాయకులు గుండ శ్రీనివాస్, కన్నం శ్రీనివాస్, బిషన్‌సింగ్, రమణారెడ్డి, కెంసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.