బతుకమ్మ చీరెల జాతర మొదలైంది.. మొదటి రోజు పంపిణీ పండుగలా సాగింది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన సారెను అందుకొని ఆడబిడ్డ మురిసిపోయింది.. చిరునవ్వుతో మెరిసిపోయింది.. బుధవారం కరీంనగర్‌లోని ఆరెపల్లిలో మంత్రి గంగుల కమలాకర్, ధర్మారం మండలం రచ్చపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, గంగాధర మండలం కురిక్యాలలో సుంకె రవి శంకర్, మెట్‌పల్లితోపాటు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావు, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, రామగిరి మండలంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, సుల్తానాబాద్ మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సిరిసిల్లలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పంపిణీ చేయగా, ఆయాచోట్ల మహిళలు చీరలను అందుకొని సంబురపడ్డారు. చీరెల నాణ్యత, రంగులు, డిజైన్లు బాగున్నాయంటూ సంబురపడ్డారు.
కరీంనగర్ కార్పొరేషన్/ హుజూరాబాద్/ మెట్పల్లి/ జగిత్యాల రూరల్/ సిరిసిల్ల కలెక్టరేట్/ ఓదెల/కోరుట్ల అక్టోబర్ 4 : బతుకమ్మ పండుగకు ఆరేళ్ల నుంచి సారె పెడుతున్న రాష్ట్ర సర్కారు, ముచ్చటగా ఏడోసారి అందిస్తున్నది. కార్మికక్షేత్రం సిరిసిల్లతోపాటు గర్శకుర్తిలో 25 వర్ణాలు, 600 అద్భుతమైన డిజైన్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరెలను, కులమతాలకతీతంగా 18ఏళ్లు నిండిన మహిళలందరికీ ఇస్తున్నది. బుధవారం నుంచే పంపిణీ మొదలు కాగా, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరెపల్లిలో మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్, ధర్మారం మండలం రచ్చపల్లిలో మహిళలకు చీరెలు అందజేశారు. హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, గంగాధర మండలం కురిక్యాలలో సుంకె రవివంకర్, మెట్‌పల్లితోపాటు కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రామగిరి మండలం పన్నూర్, కల్వచర్ల గ్రామాల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తో కలిసి జడ్పీ చైర్పర్సన్ అరుణ అందజేశారు. పలుచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పంపిణీ చేశారు. ఆయాచోట్ల పండుగ వాతావరణంలో చీరెలను అంజేయగా, ఆడబిడ్డలు సంతోషపడ్డారు. అందుకున్న సారీల కలర్లను, డిజైన్లను చూస్తూ మురిసిపోయారు. నవ్యత, నాణ్యత బాగుందని సంబురపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ఏటా సద్దుల పండుగ పూట తమ కు పెద్దన్నోలే చీరెలు పెడుతున్నాడని కొనియాడారు. ఈ సారి చీరె లు బాగున్నాయని, పట్టుచీరెలను తలపించేలా ఉన్నాయని, షాపు ల్లో దొరికే వాటిలాగా మంచిగున్నాయని కితాబునిచ్చారు.
చీరెల రంగు, డిజైన్లు మంచిగున్నయ్
తెలంగాణ అచ్చినకాన్నించి చూత్తున్నం. సీఎం కేసీఆర్ సారు ఆడబిడ్డలకు ఏదో ఒక రూపంలో అండగా ఉంటున్నడు. మంచి సదువు చెప్పిత్తండు. ఆరోగ్యం మంచిగుండాలని దవాఖాన్ల ఫ్రీగనే పరీక్షలు చేయిత్తండు. కంటి పరీక్షలు చేయించి కండ్లద్దాలు ఇచ్చిండు. పెండ్లిళ్లకు సాయపడ్తండు. పింఛన్లిత్తండు. ఇంకా ఎన్నో చేత్తండు. ఏటా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు కొత్తబట్టలు కట్టుకోవాలని మంచి చీరెలు పెడ్తండు. మంత్రి గంగుల కమలాకర్ సారు చేతుల మీదుగా నేను తీసుకున్న. చీరెల రంగులు, డిజైనర్లు బాగున్నయ్. షాపులలెక్క కొడ్తున్నయ్. పండుగకు ఇదే కట్టుకుంట. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇట్ల చేయలె. అసలు ఆడోళ్లను ఏ మాత్రం పట్టించుకోలె. మా అందరికీ మేలు చేత్తున్న సీఎం కేసీఆర్‌కు మేమంతా అండగా ఉంటం. ఆ సారునే గెలిపించుకుంటం.
మహిళలకు అండగా సర్కారు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అవన్నింటిని మహిళల పేరుపైనే అందిస్తున్నారు. బతుకమ్మ పండగను ప్రతి మహిళ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతోనే బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ చేసుకుంటే కేసీఆర్ కిట్‌తోపాటు 12వేలు ఇస్తున్నారు. అన్ని వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
– కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్
చీర బాగున్నది
ప్రభుత్వం పేదల వెన్నంటే ఉంటున్నది. మహిళలకు భరోసా ఇస్తున్నది. సీఎం కేసీఆర్ అందించిన బతుకమ్మ చీర బాగున్నది. ఒక అన్నగా తెలంగాణలోని ఆడబిడ్డలను ఆదరిస్తూ చీరెలను అందించడం చాలా సంతోషం. ఈ చీరతోనే బతుకమ్మ ఆడుతం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు నా కృతజ్ఞతలు.
– కే రజిత, సముద్రలింగాపూర్ (గంభీరావుపేట మండలం)
సారు సల్లంగుండాలె
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక మా అసోంటి ప్యాదోళ్లకు మంచి చేత్తున్నడు. నెలనెలా పింఛన్ ఇత్తండు. ఆడిపిల్లలకు పెండ్లి చేత్తే లక్ష రూపాయలు ఇత్తండు. పండుగ పూట పాత చీరెలు కట్టుకోవద్దని బతుకమ్మ పండుగకు చీరెలు ఇత్తండు. కొడుకులు చీరె కొనియ్యకున్న మాకు బాధ లేకుండా చేసిండు. ఆ సారు సల్లంగుండాలె.
– కొర్ర తారమ్మ, వృద్ధురాలు, లంబాడితండా (ఓదెల)
పండుగకు ఈ చీరెలే కట్టుకుంటం
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నడు. మా కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నడు. ధైర్యం నింపుతున్నడు. బతుకమ్మ చీరెలు ఆకట్టుకునేలా బాగున్నయ్. మహిళలు మంచిగున్నయ్ అంటున్నరు. బతుకమ్మ పండుగకు వీటినే కట్టుకుంటం.
– వీ విజయ, బీడీ కార్మికురాలు (సుందరయ్యనగర్)
డిజన్లు మంచిగున్నయ్..
బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకం. పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలన్న లక్ష్యంతో సీఎంకేసీఆర్ ఇంటికి పెద్దవాడిగా చీరలు పెడుతున్నడు. బతుకమ్మ చీరెలు మంచిగున్నయ్. రంగులు, డిజైన్లు బాగున్నయ్. ఇంత మంచి ఆలోచన గతంలోని ప్రభుత్వాలు చేయలేదు. పేదల బతుకులు, కష్టాలు తెలిసిన కేసీఆర్ సర్ అందరూ సంతోషంగా ఉండాలని ఈ పథకం తెచ్చిండు. ఎన్నో మంచి పనులు చేస్తున్న కేసీఆరే మళ్లీ సీఎం కావాలి.
– శారద, కరీంనగర్
ఆకర్షణీయంగా బతుకమ్మ చీరలు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగకు చీరలను కానుకగా అందిస్తున్నది. బతుకమ్మ చీరెలను గతంకంటే ఈ సారి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. రెండు రోజుల్లో అందరికీ పంపిణీ చేస్తాం. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బతుకమ్మ పండుగ ప్రపంచ పండుగగా ఆవిర్భవించింది. ఒకప్పుడూ హైదరాబాద్‌లో ఆంధ్రా మహిళలు బతుకమ్మ ఆడాలంటే నామోషీగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఇవాళ భక్తితో గౌరమ్మను పూజిస్తూ, ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. ఆడబిడ్డలకు కానుకగా అందించే బతుకమ్మ చీరెల ద్వారా సిరిసిల్లలోని పవర్‌లూం, నేత కార్మికులు సుస్థిర ఆదాయం పొందుతున్నారు.
– సిరిసిల్లలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్
కేసీఆరే మళ్లీ రావాలి
ఏటా ఇలా చీరలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉన్నది. గతంలోని ఏ ప్రభుత్వాలు కూడ ఇలా మహిళలను గుర్తించిన పాపానపోలేదు. ఎంతో పెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సారు చీరెలు ఇస్తున్నడు. పేదల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న కేసీఆర్ సారు మళ్లీ రావాలి. మేం ఆ సారుకు అండగా ఉంటం. వచ్చే ఎన్నికల్లో వారితోనే ముందుకుసాగుతం.
– శంకరమ్మ, కరీంనగర్