నాడు తెలంగాణను పూర్తిగా నిర్జీవంగా చేసిన్రు. మన వనరులను పీక్కుతిన్న గద్దలే నేడు పాదయాత్రల పేరిట మళ్లీ వస్తున్నరు. నేనొక్కటే అడుగుతున్నా.. షర్మిలకు ఇక్కడ ఏం పని? పాదయాత్ర ఎందుకు..? మళ్లీ దోచుకునేందుకే కదా..? ప్రజలందరికీ మేమొక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీలకు అధికారం ఇస్తే మళ్లీ మనల్ని అడుక్కుతినేలా చేస్తరు. ఆనాడు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఏండ్లకేండ్లు పాలించి తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే ప్రజల కష్టాలు, కన్నీళ్లు దూరమైనయ్. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పట్టం గట్టడం ఖాయం.
– మండలి చీఫ్ విప్ భానుప్రసాద్ సన్మాన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్
పెద్దపల్లి, మార్చి 4(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి: నాడు తెలంగాణ ప్రాంతాన్ని పీక్కుతిన్న గద్దలే నేడు పాదయాత్రలు చేస్తున్నాయని, పచ్చని రాష్ర్టాన్ని మళ్లీ ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌కో, బీజేపీకో అధికారమిస్తే మనల్ని అడుక్కుతినేలా చేస్తాయని విమర్శించారు. 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాగునీరు, ఎరువులు, కరెంటు, పంట కొనుగోలు, తాగునీటి కోసం ప్రతి రోజూ ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ, స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత మన కష్టాలన్నీ దూరమయ్యాయని చెప్పారు. మండలి చీఫ్ విప్‌గా భానుప్రసాదరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సొంత జిల్లా పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక పాలనను సాగించిన కాంగ్రెస్, నాడు తెలంగాణ ప్రాంతాన్ని నిర్జీవంగా మార్చిందని మండిపడ్డారు. తెలంగాణ అంటే కష్టాలు.. కన్నీ ళ్లు, బొగ్గుబాయి, దుబాయి, గుడ్డి దీపాల వెలుగులని కాంగ్రెస్, బీజేపీ పాలకులు వ్యంగ్యంగా మాట్లాడారని, మన వనరులను రాబందుల్లా పీక్కు తిన్నారని మండిపడ్డారు. మన పక్కనే గోదావరి పారుతువున్నా మీరు ఒడ్డుమీదున్నారని, మీకు నీళ్లు రావని వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. గోదావరి నీళ్లు కండ్ల ముందటే కిందికి వెళ్తున్నా అప్పటి సీఎంలు, ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ రాక ముందు 2009లో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పుడు ఎండిన పంటలు, కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో అసెంబ్లీకి వెళ్లేదని గుర్తు చేశారు. కానీ, సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ బీళ్లకు నీళ్లను మళ్లించారని, అందుకే సాగు పండుగలా మారిందని చెప్పారు. సంపద పెంచి, పేదలకు పంచుతున్న ఘనత ఆయనకే దక్కిందని కొనియడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సేవా నిరతితో అద్భుతమైన పాలనను అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని బీఆర్ఎస్కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలే గొప్ప హిందువులని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాను ఎగరేసేందుకు శ్రేణులు కృషి చేయాలన్నారు. ఇక్కడ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మేయర్ బంగి అనిల్‌కుమార్, జడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి పాల్గొన్నారు.
రేవంత్.. చంద్రబాబుకు ఏజెంట్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బెదిరింపులతో డబ్బులు సంపాదిస్తూ చంద్రబాబునాయుడికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో మెట్ట ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరిగి బంగారు పంటలు పండుతుంటే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బూటకపు పాదయాత్ర చేస్తూ సాగు విస్తీర్ణంపై అసత్యాలు మాట్లాడుతున్నారు. 2014కు ముందు యాసంగిలో 28 లక్షల ఎకరాల్లో పంటలు పండితే, నేడు 68 లక్షల ఎకరాల్లో సాగవుతుండడం కనిపించడం లేదా?. రేవంత్‌రెడ్డి మాటలు ఆపి అభివృద్ధిని చూడాలి.
రేవంత్‌రెడ్డి ఓ చిల్లరవ్యక్తి
ఆనాడు ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన రేవంత్‌రెడ్డికి మా గురించి మాట్లాడే అర్హత లేదు. అతనో చిల్లర వ్యక్తి. సమైక్యవాదుల బూట్లు నాకిన రవ్వంత రెడ్డి, కామన్ సెన్స్ లేని కవ్వంపల్లి లాంటి చిల్లరమల్లరగాళ్ల మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మరు. కవ్వంపల్లి దళిత జాతికి పట్టిన పెద్దపీడ. దళితుల గౌరవం నిలపలేని దౌర్భాగ్యుడు. 500 వైద్యానికి 50 వేల వసూలు చేసి కరీంనగర్, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నడు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పే దమ్ముందా..? నియోజకవర్గానికి ఏదో చేస్తానని తెగ తిరుగుతున్నాడు. కానీ, ఆయనకు కనీసం సర్పంచ్‌గా గెలిచే ఇమేజ్ లేదు. ఒకవేళ గెలిస్తే నేను మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయ.
– మానకొండూర్‌లో విలేకరులతో రసమయి బాలకిషన్ సవాల్
గొప్ప దార్శనికుడు కేసీఆర్
గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, పేద విద్యార్థులకు విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు, జిల్లాకో మెడికల్ కళాశాల, ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేసిన దార్శనికుడు సీఎం కేసీఆర్. ఆయన ‘కేజీ టూ పీజీ’ కల త్వరలోనే సాకారం కానున్నది. గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్య అందుతున్నది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1.20లక్షలు ఖర్చు చేస్తున్నది. నా ఎమ్మెల్సీ పదవీ కాలం మరో నాలుగున్నరేండ్ల దాకా ఉంటుంది. పెద్దపల్లి అసెంబ్లీ బరిలో నేను నిలబడను. టికెట్ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరికి ఇస్తే.. గత ఎన్నికల మాదిరిగానే ఆయన గెలుపున కోసం కృషి చేస్త. సీఎం కేసీఆర్ పాలనలోనే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తున్నది. ఆయన నాయకత్వంలోనే పెద్దపల్లి జిల్లా అభివృద్ధిలో ముందు వరసలో నిలిచింది.
-మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు
ఢిల్లీ గద్దెపై గులాబీ జెండాను ఎగురవేస్తం
బీఆర్ఎస్ దేశ వ్యా ప్తంగా విజయాన్ని సాధిస్తుంది. ఢిల్లీ గద్దె పై సైతం గులాబీ జెండాను ఎగురవేస్తం. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. పెద్దపల్లి జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నది. శ్రేణులు అనవసర అంశాలపై చర్చ పెట్టద్దు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. బీజేపీ బట్టేబాజ్.. జూటా పార్టీ. అది తెలంగాణలో చేసింది శూన్యం. పునర్విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీజేపీలు మునిగిపోతున్న నావలు. వారి విమర్శలను తిప్పి కొట్టాలి.
– పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని
రాష్ర్టానికే తలమానికం
వ్యవసాయం, సహజన వనరుల లభ్యతలో పెద్దపల్లి జిల్లా రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తుంది. పెద్దపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా మంత్రులతో పాటు నా వంతు సహకారాన్ని అందిస్త. జిల్లాకు మరో కేబినెట్ హోదా పదవి రావడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అభివృద్ధిలో మరింత వేగవంతమవుతుంది.
– ఎమ్మెల్సీ ఎల్ రమణ
వివేక్ పత్తా కటైంది
కష్టపడి పనిచేసే ప్రతి కా ర్యకర్తకూ గుర్తింపు లభిస్తుంది. పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులపై అధినేత కేసీఆర్ ఎప్పుడు చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటరు. బీఆర్ఎస్ నేతగా ఉన్న వివేక్ మోసాన్ని గుర్తించారు కాబట్టే ఆయన పత్తా కటైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి మేలు కలిగేలా పనిచేయాలి. ముఖ్య నేతలతో సెల్ఫీలు దిగి ఎమ్మెల్యే టికెట్ మాకే అనే రీతిలో ప్రచారం చేసుకోవడం సరికాదు. ఎవరి సేవలు ఎక్కడ అవసరమో పార్టీ గుర్తించి బాధ్యతలు ఇస్తుంది. భాను ప్రసాదరావుకు చీఫ్‌విప్‌గా అవకాశం ఇవ్వడం వల్ల జిల్లాకు మరో కేబినెట్ పదవి దక్కింది. ఆయనతో జిల్లాకు మేలు జరుగుతుంది.
– జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
భానుప్రసాదరావుతో గొప్ప ప్రభావం
పెద్దపల్లి బిడ్డ భానుప్రసాదరావుకు మండలి చీఫ్‌విప్‌గా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం జిల్లా పై గొప్పగా ప్రభావాన్ని చూపుతుంది. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత ఆయనకే ఇచ్చినట్లయ్యింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా కేబినెట్ హోదాలో భానుప్రసాదరావు పనిచేయాలి. బీఆర్ఎస్ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను, నాయకున్ని గుర్తించి అవకాశాలు ఇస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
నియోజకవర్గానికి శుభ సూచకం
ఎమ్మెల్సీ భాను ప్రసాదరావుకు కేబినెట్ హోదా కల్పించడం శుభ సూచకం. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా ప్రయోజనం కలుగుతుంది. అవసరమైన అన్ని పనులను చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టానికి అకుంఠిత దీక్షతో పనిచేయాలి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి