కొత్తపల్లి, నవంబర్ 22 : కారు మనదే.. సర్కారూ మనదేనని, సమైక్యపాలనలో నల్లమొఖమైన కరీంనగర్‌ను తెల్లగా మార్చానని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి పట్టణంలో విస్త్రృతంగా ప్రచారం చేశారు. వాడ వాడకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు మంగళహారతులు, పూలమాలలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలుకగా, ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచినవారు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదని, అలాంటిది తాను చేసిన అభివృద్ధిని గుర్తించిన కరీంనగర్ ప్రజలు వరుసగా రెండోసారి, మూడోసారి గెలిపించుకొని కుటుంబ సభ్యుడిగా ఆదరించారని గుర్తు చేశారు.
కొత్తపల్లిలోని అన్ని వార్డుల్లో రోడ్లు వేశామని, అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. తాను చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందు ఉందని, దానిని గుర్తించి మరోసారి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనపై పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిపై 32 కేసులతో రౌడీషీట్ నమోదై ఉందని, కోట్లాది రూపాయలు తీసుకుని భూ కజ్జాదారుడికి ఆ పార్టీ టిక్కెట్ కేటాయించిందని, అలాంటి వ్యక్తికి ఓట్లు ఎలా పడుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మన భూములను, ఇళ్లను కబ్జా చేస్తాడని మండిపడ్డారు. నాడు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఓడి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఆ తరువాత ఎప్పుడైనా కొత్తపల్లికి వచ్చి కనిపించాడా..? అని ప్రశ్నించారు. ఇక అభివృద్ధి ఎలా చేస్తాడో అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో టిక్కెట్లు అమ్ముకున్నాడనే ఆరోపణలతో పదవి నుంచి తొలగించారని విమర్శించారు.
బీజేపీ నాయకులు ఓటుకు రూ 20వేలు, సెల్ఫోన్లు ఇస్తామని చెబుతున్నారని, బండి సంజయ్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏం వ్యాపారం చేసి నాలుగేళ్లలో బండి సంజయ్ రూ.వందల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను గెలిచిన తరువాత కొత్తపల్లి పట్టణంలో పాత ఇంటిపన్నును పునరుద్దరిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపల్లి అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెడికల్ కళాశాలను పట్టణ పరిధిలో ఏర్పాటు చేశామని, అందులో ఉద్యోగాలను కొత్తపల్లి వాసులకే ఎక్కువ వచ్చేలా చూస్తానని భరోసా కల్పించారు. కరీంనగర్ మాదిరిగా రేకుర్తి నుంచి కొత్తపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు సాగుతున్నాయన్నారు.
కాంగ్రెస్, బీజేపీ హైకమాండ్లు ఢిల్లీలో ఉంటాయని, వారు చెప్పిన ప్రకారమే ఇక్కడి నాయకులు నడుస్తారని చెప్పారు. తెలంగాణాలో హైకమాండ్ మన దగ్గరే ఉంటుందని, ఏం కావాలన్నా ఇక్కడే నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. తాను కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా కరీంనగర్ ప్రజలను విడిచిపోలేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కరెంట్, నీళ్ల కోసం పడ్డ కష్టాలు మళ్లీ రావద్దంటే బీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి ప్రజలు వేల సంఖ్యలో హాజరై మంత్రి గంగులకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలుద్దీన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, రైతు సమన్వయ సమితి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.