తెలంగాణ సంపదను మళ్లీ దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఆ పార్టీ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పాలసీ ఏంటో రేవంత్‌రెడ్డి వాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు.. అది కాంగ్రెస్ విధానం కాకపోతే వెంటనే రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. లేకపోతే ఆయనతో కాంగ్రెస్ అధిష్టానం ఏకీభవించనట్లే అవుతుంది. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ పార్టీని మూడు అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేయాలి. చంద్రబాబు, షర్మిల కుమ్మక్కై రేవంత్‌రెడ్డితో ఇలా మాట్లాడిస్తున్నరు.
– మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, జూలై 11 : రాష్ట్రంలోని సంపదను మళ్లీ దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణను గుడ్డి దీపం చేసే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వాఖ్యలకు నిరసనగా కరీంనగర్ నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి ఉరి వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రైతులకు మూడు గంటలు చాలు అన్న కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలే రేవంత్‌రెడ్డి నోటి వెంట వచ్చాయని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలన్నీ చంద్రబాబు మాట్లాడించినవేనని దుయ్యబట్టారు. 2108లో కాంగ్రెస్, టీడీపీ కలిసి మహాకూటమి పెట్టుకొని తెలంగాణను ధ్వంసం చేసే కుట్రలు చేశాయని ఆరోపించారు. ఆ కూటమి ఇంకా కొనసాగుతుందని, తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉందని దుయ్యబట్టారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని మాట్లాడారని, గత 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ విధానం ఇదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ తన విధానాన్ని ప్రకటించిందని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు మూడు గంటలే కరెంటు ఇవ్వడం వల్ల పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక పొలాల వద్దే రైతులు పండుకునే స్థితి ఉండేదని, ఇప్పుడు మళ్లీ ఆ స్థితిని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిస్తున్న పక్కన ఉన్న కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లోనూ 24 గంటల కరెంటు లేదని, అదే తీరులో తెలంగాణలో కూడా రావాలని ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ మూడు గంటలే కరెంటు ఇచ్చి మిగిలిన కరెంటును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌కు తరలించుకుపోవాలని చూస్తున్నారని విమర్శించారు. కరెంటుతోపాటు బొగ్గును దోచుకపోయి తెలంగాణను మళ్లీ గుడ్డి దీపం చేస్తుందని దుయ్యబట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ ముందస్తుగా తన మేనిఫెస్టోను ప్రకటించుకుందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్ కిట్, రైతుబీమా కూడా బంద్ చేస్తారని, ఏండ్ల తరబడి పాలించిన తీరు ఈ వాఖ్యలతో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ మాత్రం మళ్లీ కష్టాల పాలు చేసేందుకు కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే అన్నంపెట్టే స్థాయి తెలంగాణ ఎదిగిందన్నారు. అదే కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో అన్నం పెట్టేందుకు గింజలు కూడా లేవని దుయ్యబట్టారు. పక్కన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పండిన పంటను కొనే స్థితి లేదని, అదే దుస్థితిని తెలంగాణలో తీసుకువచ్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. మనం ఒక తప్పు చేస్తే భావి తరాలు ఇబ్బంది పడుతాయని, భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు వ్యక్తిగతమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, ఆయన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విధానం అంతా కూడా ఢిల్లీ నుంచి నడుస్తుందని, తమ విధానం మాత్రం హైదరాబాద్‌లోనే నిర్ణయించి నడుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపివేస్తారని హెచ్చరించారు. గతంలోనూ కాంగ్రెస్ నాయకుడు బలరాం నాయక్ కూడా ఇదే వాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక్కడి సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, ఆంధ్రా పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, వాల రమణారావు, నాయకులు శ్యాంసుందర్, ఆరె రవి, సంపత్, వేణు, వసంతరావు పాల్గొన్నారు.