కరీంనగర్లో వాడవాడలా సీసీ రోడ్లు నిర్మించి మట్టిరోడ్లు లేని కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆదివారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ అభివృద్ధికి వేల కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. నగరానికి మణిహారమైన మానేరు రివర్‌ఫ్రంట్ తొలిదశ పనులను ఆగస్టు చివరకు పూర్తిచేసి ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై పలు వివరాలు వెల్లడించారు.
కార్పొరేషన్, జూలై 16: కరీంనగర్లో వాడవాడలా సీసీ రహదారులు నిర్మించి రాష్ట్రంలోనే మట్టిరోడ్లు రహిత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరాభివృద్ధికి సీఎం ఆస్యూరెన్స్ కింద రూ. 350 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో మిగిలిన రూ. 132 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఈ పనుల కోసం టెండర్ల దాఖలుకు ఆగస్టు 4వరకు గడువు విధించామని చెప్పారు. ఆగస్టు 15లోగా టెండర్లు కేటాయించి పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మండలాల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి గంగుల విలేకరులతో మాట్లాడారు. తాము ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతామని, ఆ తర్వాత అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తామని స్పష్టంచేశారు. నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వేలకోట్లు కేటాయించారని చెప్పారు.
ఈ నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి ప్రజల కండ్లకు కనిపిస్తున్నదని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే వారు ఇకడి అభివృద్ధిని చూసి అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామన్నారు. నగరంలోని కొతిరాంపూర్ నుంచి గిద్దపెరుమాళ్ల ఆలయం మీదుగా కట్టరాంపూర్ వరకు, కశ్మీర్‌గడ్డ మారెట్ నుంచి జ్యోతినగర్‌లోని మోర్ సూపర్ మారెట్ వరకు రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో పలు ఐలాండ్స్‌ను సుందరీకరించామన్నారు. త్వరలోనే మరో నాలుగు ఐలాండ్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విలీన డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. ఆరెపల్లికి రూ.4 కోట్లు, రేకుర్తికి రూ.8 కోట్లు, సీతారాంపూర్‌కు రూ.4 కోట్లు, 1,2 డివిజన్లకు రూ. 6 కోట్లు కేటాయించామన్నారు. ఈ అభివృద్ది పనులన్నింటిని ఎన్నికల్లోగా పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో రూ. 25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమైక్య పాలనలో రూ. 10 లక్షల నిధుల కోసం వెంపర్లాడాల్సి వచ్చేదని, కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థితిలేదన్నారు. కరీంనగర్ రివర్ ఫ్రంట్ తొలిదశ పనులను పూర్తి చేసి ఆగస్టు ఆఖరులోగా ప్రారంభిస్తామని చెప్పారు. 12 ఫీట్ల మేరకు నీరు నిల్వుంచి రెండు బోట్లను నడిపిస్తామన్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, భూమాగౌడ్ పాల్గొన్నారు.