తిమ్మాపూర్, సెప్టెంబర్21: ‘బీసీ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి. ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో ఏర్పాటు చేసిన గురుకులాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేసుకోవాలి’ అని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాలను ఏర్పాటు చేసి, రూ.లక్షల విలువైన నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. తిమ్మాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని, శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కేజీ నుంచి పీజీ దాకా విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని, కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తున్నారని వివరించారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని, చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కాదన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని, బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని చెప్పేవారని గుర్తు చేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని, సకల వసతులతో బోధన అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవని, నేడు స్వరాష్ట్రంలో 337 పాఠశాలలు, 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.
దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఇకడి గురుకుల పాఠశాల చిన్నగా ఉండి విద్యార్థులు పడుతుంటే, తానే ప్రత్యేక చొరవ తీసుకొని యూనివర్సిటీ స్థాయి భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. విద్యార్థులను చూస్తే ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు మంత్రి, ఎమ్మెల్యే కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడా జెండా ఎగరేసి, వందనం స్వీకరించారు. కార్యక్రమం పూర్తయి వెళ్తుండగా, చిన్నారులు మంత్రిని అడ్డుకుని మరీ తమ డ్యాన్స్ చూడాలని అడగడంతో మంత్రి తిరిగి వచ్చి మరీ తిలకించారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, ఎంజేపీ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపాల్ విమల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.