కరీంనగర్ : తెలంగాణ ఏర్పాటు తరువాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ పాతబజార్ శివాలయం-కాపువాడ లింకు రోడ్డు పనులను మేయర్ సునీల్ రావు తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి మరింత శరవేగంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.2,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మాయమాటలతో మోసగించే వారిని నమ్మవద్దని సూచించారు.
ఓట్ల కోసం డ్రామాలడే వాళ్లకు అవకాశం ఇస్తే అభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా నగరాన్ని రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. నగరంలో మట్టి రోడ్లకు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమం లో కార్పొరేటర్లు నేతి కుంట యాదయ్య ,కోలమాలతి సంపత్ రెడ్డి, మున్సిపల్ డీఈలు మసూద్, నాగమల్లేశ్వరరావు, ఏఈ వాణి తదితరులు ఉన్నారు.