HomeKarimnagarMinister Eshwar The Government Has Built A Bridge Between Yeswant Raopet And Gangapur With 3 60 Crores And It Has Been Made Available Within Six Months
వారధి తీర్చిన వ్యథ
బుగ్గారం మండలంలోని యశ్వంత్‌రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి.
యశ్వంత్ రావుపేటకు వంతెన వచ్చింది
ఏ చిన్న అవసరం, ఆపద వచ్చినా పక్కనే ఉన్న మండల కేంద్రానికి పోలేని బాధ ఒకరిది. భూమినే నమ్ముకొని సాగు చేసే రైతు గ్రామ శివారులో ఉన్న తన పొలానికి వెళ్లలేని ధైన్యమొకరిది. మొన్నటిదాకా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేట – గంగాపూర్ గ్రామాల ప్రజల ఆవేదన ఇది. వానకాలం వచ్చిందంటే చాలు నాలుగునెలలపాటు ప్రవహించే వాగుతో ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు దాటలేక అర కిలోమీటరు దూరానికి చుట్టూ పదికిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి వారిది. ఇలా దశాబ్దాలపాటు నరకం చూసిన ఈ రెండు గ్రామాలతోపాటు చుట్టూ ఉన్న పల్లెల గోస స్వరాష్ట్రంలో తీరింది. మంత్రి ఈశ్వర్ చొరవతో ప్రభుత్వం యశ్వంత్‌రావుపేట – గంగాపూర్ మధ్య 3.60కోట్లతో బ్రిడ్జిని నిర్మించి, ఆరు నెలల కిందే అందుబాటులోకి తేగా ప్రజానీకం సంబురపడుతున్నది. రవాణా వ్యవస్థ మెరుగుపడి, ఏండ్లనాటి బాధలన్నీ దూరం కాగా, ఇప్పుడు ఏ ఆటంకం లేకుండా తమ పనులు చేసుకుంటున్నది.
– ధర్మపురి, జూన్24
ధర్మపురి, జూన్ 24 : బుగ్గారం మండలంలోని యశ్వంత్‌రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రహిస్తుంది. వాగుకు అటువైపు గంగాపూ ర్ గ్రామం ఉంటుంది. ఈ రెండు గ్రామాలు గతం లో గొల్లపెల్లి మండల పరిధిలో ఉండేవి. మండలాల పునర్విభజనలో భాగంగా ధర్మపురిలోని బుగ్గారం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ధర్మపురి మండలం నుంచి తొమ్మిది, గొల్లపెల్లి మండలంలోని రెండు గ్రామాలను బుగ్గారంలో కలిపారు. అయితే ఇందులో యశ్వంత్‌రావుపేట- గంగాపూర్ గ్రామాల మధ్య యశ్వంత్‌రావుపేట వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఇటు వాళ్లు, అటు.. అటువాళ్లు ఇటు దాటలేని దుస్థితి ఉండేది.
వానకాలంలో వాగుదాటలేక
గంగాపూర్, యశ్వంతరావ్‌పేట మధ్య యశ్వంతరావ్‌పేట వాగు వానకాలంలో దాదాపు నెలలపాటు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే గతంలో నీటి ప్రవాహం మోస్తరుగా మాత్రమే ఉండేది. అయితే యశ్వంతరావ్‌పేట పాత చెరువు పునరుద్ధరణతో చెరువు నీటి సామర్థ్యం పెరిగింది. ఇంకా చెరువుకు ఎస్సారెస్పీ కాలువ లింక్ ఉండడంతో వానకాలంలో వాగు ప్రవాహం ఎక్కువైంది. దీంతో పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాల రైతులు శివారులో ఉన్న పొలానికి వెళ్లలేని దుస్థితి. గంగాపూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గారం మండల కేంద్రానికి వెళ్లలేని దుస్థితి. అనంతారం, రొడ్డాం, తక్కలపెల్లి, కల్లెడ మీదుగా దాదాపు 10 కిలోమీటర్ల ప్రయాణించాల్సి వచ్చేది. ఇక సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లాలంటే చుట్టూ ఐదారు గ్రామాల మీదుగా 10 కిలోమీటర్లు తిరిగి చేరుకోవాల్సి వస్తుండేది.
మంత్రి ఈశ్వర్‌తోనే వంతెన
తమ గ్రామాల మధ్య వారధి నిర్మించాలని యశ్వంత్‌రావుపేట, గంగాపూర్ గ్రామాల ప్రజలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, అప్పటి సమైక్య పాలకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంత్రి ఈశ్వర్ స్వరాష్ట్రంలో వారధి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 3.60కోట్లు మంజూరు చేయించారు. 8 పిల్లర్లతో దాదాపు 600మీటర్ల మేర గంగాపూర్ వైపు అప్రోచ్ రోడ్‌తో కలిసి వంతెనను నిర్మించారు. ఆరు నెలల కిందే అందుబాటులోకి రాగా, ఈ రెండు గ్రామాలతోపాటు చూట్టూ ఉన్న గ్రామాల ప్రజలు రయ్య్‌మ్రని దూసుకెళ్తున్నారు. రెండు గ్రామాలతో పాటు బుగ్గారం, గొల్లపెల్లి మండలాల మధ్య కూడా రవాణా వ్యవస్థ మెరుగుపడింది.
ఏండ్లనాటి బాధ తీరింది..
యశ్వంత్‌రావుపేట-గంగాపూర్ మధ్య వంతెన నిర్మించాలని ఏండ్లుగా డిమాండ్ చేశాం. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. సమస్యను మంత్రి ఈశ్వర్ గుర్తించి నిధులు మంజూరు చేయించారు. ఆరునెలల కింద వంతెన పూర్తయి ఏండ్లనాటి బాధ తీరింది. బుగ్గారం, గొల్లపెల్లి మండలాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడింది. ఇప్పుడు ఏ బాధాలేకుండా అటు రైతులు, ఇటు ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు.
– ఎండీ రహమాన్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు (బుగ్గారం)
రయ్యిమని పోతున్నం..
యశ్వంతరావ్‌పేట వాగు కోసం ఏండ్లుగా ఎదురుచూసినం. అందరూ కట్టిస్తామని మాట ఇచ్చేటోళ్లేకానీ ఏ ఒక్కరూ చేయలేదు. వానకాలం వస్తే చాలు మాకు దుఃఖమస్తుండె. కనీసం శివారులో ఉన్న పొలానికి పోలేని పరిస్థితి. చాలా ఇబ్బంది అయితుండె. కానీ, కొప్పుల ఈశ్వర్ సారు వంతెన కట్టించిండు. ఇప్పుడు అటువాళ్లు ఇటు.. ఇటు వాళ్లు అటు రయ్యిమని పోతున్నం. కొప్పుల ఈశ్వర్ సారుకు ధన్యవాదాలు.