రాంనగర్, సెప్టెంబర్ 17 : నిరుద్యోగ యు వతకు నైపుణ్య శిక్షణ అందించే స్కిల్ సెంటర్ కరీంనగర్లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం లో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు కోర్సు ప్రవేశపెడుతామని చెప్పారు.
విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏపనీ జరుగదన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని, కుల వృత్తిదారులకు ఆదాయం కల్పించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో విశ్వకర్మలు భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మే డిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కే మహేశ్వర్, బీసీ సంక్షేమశాఖాధికారి అనిల్ ప్రకాశ్, విశ్వకర్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.