కరీంనగర్ విద్యానగర్, జూన్ 19: రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. తనకీ మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షేనని ఉద్వేగానికి లోనయ్యారు. రాబోయే రోజుల్లో అంజన్న, రాజన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి బుధవారం కరీంనగర్ వచ్చిన ఆయనకు, శనిగరం నుంచి దారిపొడవునా అభిమానులు, నాయకులు స్వాగతం పలికారు.
నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఘనంగా స్వాగతించారు. అకడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై సంజయ్ అభివాదం చేస్తూ కమాన్ వద్దకు వచ్చారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, తనకు గుర్తింపునిచ్చిన తెలంగాణ ప్రజలకు ‘సెల్యూట్ కరీంనగర్.. సెల్యూట్ తెలంగాణ’ అంటూ సాష్టంగా నమసారం చేశారు. తెలంగాణ చౌక్‌కు రాగానే పలువురు ముస్లిం నాయకులు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్ వద్ద సంజయ్‌కు కలెక్టర్, అదనపు కలెక్టర్ పూల బొకేలు అందించారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అకడి నుంచి చైతన్యపురిలోని మహాశక్తి అమ్మవారి ఆలయానికి చేరుకొని, కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు.
ఆ తర్వాత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో కట్టిన ముడుపు విప్పి మొ క్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి, వేములవాడలో రాజరాజేశ్వర స్వామి, సిరిసిల్లలో మార్కండేయ స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఆయాచోట్ల బండి సంజయ్ మాట్లాడారు. అధికారాన్ని డబ్బు కోసమో, పదవీ దర్పం కోసమో వినియోగించబోనని, ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని, అమ్మవారి ఆశీస్సులతోనే ఎదిగానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర పేరిట 155 రోజులు పాదయాత్ర చేస్తే.. తన అడుగులో అడుగు వేసి కార్యకర్తలు నడిచినందునే ఈ పదవి వచ్చిందన్నారు. అందుకే ఈ పదవి కార్యకర్తలకే అంకితం చేస్తున్నానని చెప్పారు.