మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. ‘అధికార’బలంతో సహజ వనరులను కొల్లగొడుతున్నది. వాగుల్లో ఇసుకనే కాదు, గుట్టల మట్టినీ వదలడం లేదు. బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని కుందేలు గుట్ట నుంచి రాత్రింబవళ్లు ఇసుక, మొరం అక్రమంగా రవాణా చేస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నది. ఇంత జరుగుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మెట్పల్ల్లి, జూన్ 4 : మెట్పల్లి మండలం బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని 63వ జాతీయ రహదారికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న కుందేలు గుట్ట మైనింగ్ మాఫియా చేతిలో చిక్కుకున్నది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా ఎక్స్కవేటర్, ప్రొక్లయినర్ల దాటికి కరిగిపోతున్నది. రాళ్లు, రప్పలు లేకుండా కేవలం మొరంతో ఉన్న ఈ గుట్ట మీద మైనింగ్ మాఫియా కన్నుపడింది. సుమారు 38 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన గుట్ట ప్రాంతంలో వివిధ సామాజిక వర్గాలకు సైతం అప్పటి అధికారులు కొత్త విస్తీర్ణానికి అసైన్డ్ పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఇది సాగుకు ఏ మాత్రం అనువు కాదు. ఈ క్రమంలో చదును అయితే, తమకు అనువుగా మారుతుందనే ఆలోచనతో కొందరు అసైన్డ్ పట్టాదారులు మొరం అక్రమ తవ్వకం, రవాణాకు అభ్యంతరం తెలుపడం లేదని తెలుస్తున్నది. ఇదే అదనుగా మైనింగ్ మాఫియా బరి తెగించి గుట్టను మిషనరీల సాయంతో తొలిచేస్తూ మొరంను ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా రాత్రింబవళ్లు పట్టణ, గ్రామాల్లో జరిగే వివిధ నిర్మాణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ఓ ఇద్దరు స్థానిక నాయకులు ఈ మాఫియాలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కొంత కాలం కిందట ఆ ఇద్దరు నాయకులు మొరం తవ్వకం, రవాణా విషయంలో ఘర్షణ పడి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లినట్టు తెలిసింది. ఆ తర్వాత ఒక వైపు కాకుండా గుట్టను చెరో వైపు పంచుకుని మొరం తరలించుకునేందుకు రాజీపడి తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్టు సమాచారం. మిషన్ల ద్వారా తీసిన మొరాన్ని ట్రాక్టర్‌కు 500, టిప్పర్‌కు 1200 నుంచి 1500 చొప్పున వసూలు చేస్తుండగా మరికొందరు వీరికి సబ్ ఏజెంట్లుగా తోడై ట్రాక్టర్లు, ట్రిప్పర్లలో తవ్వకం దారులకు ఆ నిర్ణీత ధరకు డబ్బులు చెల్లిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి చెరవేస్తూ ట్రాక్టర్‌కు వెయ్యి నుంచి 1200, టిప్పర్‌కు 2వేల నుంచి 3వేల దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కుందేలు గుట్టను ఇష్టారాజ్యంగా తోడేస్తూ వచ్చిన ఆదాయం పంచుకుంటూ తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు.
పట్టని అధికారులు?
పట్ట పగలు దర్జాగా మొరం అక్రమ దందా సాగుతున్నా సంబంధిత విభాగాల అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. మైనింగ్ మాఫియా తమ అంగ, ఆర్థిక బలానికి అధికార పార్టీ అనే బలం తోడవడంతో అధికారులు అటువైపు వెళ్లకుండా ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఎప్పుడైనా ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చినప్పుడు ఒకటి, రెండు ట్రాక్టర్లు పట్టుకోవడం, జరిమానా విధించి వదిలేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటు స్థానిక అటవీ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అటవీ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నా, గుట్టను తవ్వేస్తూ చెట్లను ధ్వంసం చేస్తున్నా, టేకు, మోదుగ వంటి పలు రకాల చెట్లు కనుమరుగవుతున్నా పట్టించుకునే వారు లేరని స్థానికులు మండిపడుతున్నారు. చెట్ల తొలగింపును నిలువరించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు
సహజ సంపదను కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై స్వయంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఈ గతనెల 19న కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తోచేస్తూ మొరం అక్రమంగా రవాణా చేస్తున్నారని, తక్షణమే సహజ వనరులను కాపాడాలని, మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఓ మూడు రోజులుగా మైనింగ్ మాఫియా అప్రమత్తమై మొరం తవ్వకం, రవాణాను నిలిపివేసింది. తర్వాత యాథావిధిగా దందాను సాగిస్తున్నారు. గుట్ట వెనక భాగంలో రాత్రి పూట అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ మొరం తరలిస్తున్నారు.
మొరం తీయకుండా చర్యలు
కుందేలు గుట్ట నుంచి అక్రమంగా మొరం తీయకుండా చర్యలు చేపడుతున్నాం. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం. అక్రమ తవ్వకం, రవాణాను అడ్డుకునేందుకు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మైనింగ్ అధికారలు కూడా పరిశీలించారు.
– శ్రీనివాస్, తహసీల్దార్ (మెట్పల్లి)