రాయికల్, నవంబర్ 5: రెండు రోజుల్లో స్వగ్రామంలో తన కష్టార్జితంతో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం జరుగుతుందని సంబురపడ్డ వలస జీవి కల చెదిరింది. సౌదీలో విధులు ముగించుకొని వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రాయికల్‌కు చెందిన సుతారి ధర్మయ్య అలియాస్ తోట ధర్మయ్య ఉపాధి కోసం పదేళ్లుగా సౌదీ దేశానికి వెళ్తున్నాడు.
మంగళవారం సౌదీలోని జెద్దా ప్రాంతంలో పనులు ముగించుకొని తిరిగి రూమ్‌కి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ వాహనం ఢీకొని అకడికకడే మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో ధర్మయ్య స్వగ్రామంలో నూతన గృహప్రవేశం ఉండగా, ఆయన మరణ వార్త విని కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. ధర్మయ్యకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.