అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలును తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. కనీసం సర్కారు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో కార్మికులు శనివారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. నేడు కలెక్టరేట్‌ను ముట్టడించడంతోపాటు నేటి నుంచి పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజనం బంద్ చేస్తామని ప్రకటించారు.
పెద్దపల్లి కమాన్, నవంబర్ 14 : తమ ప్రభుత్వం వస్తే 10 వేల వేతనంతో పాటు వంట సరుకులను ముందుగానే అందిస్తామని మభ్యపెట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చాక హామీలను గాలికొదిలేశారంటూ మధ్యాహ్న కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి మెస్, కోడిగుడ్ల బిల్లులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోతున్నారు. అప్పులు తెచ్చి మరీ వంట చేస్తున్నామని, అధికారులను బిల్లులు అడిగితే సంతకాలు పెట్టి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 3 వేల వేతనాన్ని 10 వేలకు పెంచుతామని చెప్పి, అసలు జీతానికే ఎసరు పెట్టారని మండిపడుతున్నారు. కొందరైతే సమయానికి అప్పులు దొరకక మెడలోని బంగారాన్ని తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజనానికి సరుకులు తెస్తున్నామంటూ వాపోతున్నారు. వేతనాలు పెరగకపోగా బిల్లులు కూడా అందకపోవడంతో గత సెప్టెంబర్ ఒకటి నుంచి సమ్మెకు దిగుతామని కార్మికులు ప్రకటించారు. అయితే, పలువురు ప్రజాప్రతినిధులు బిల్లులు ఇచ్చేలా సీఎంతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంలో విరమించారు. రెండు నెలలు గడిచినా హామీ అమలు చేయకపోవడంతో శనివారం నుంచి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన వంటను బంద్ చేస్తున్నట్లు ఇప్పటికే ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. అలాగే, శనివారం ఉదయం పెద్దపల్లి కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు ఐఏటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేశ్ స్పష్టం చేశారు.
వంట చేసిన బిల్లులు, జీతాలు వస్తలేవు. ఇప్పటికే లక్షా 50 వేల అప్పు తెచ్చినం. ఎక్కడా అప్పు దొరకపోతే నా మెడలోని బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వంట సరుకులు కొని తెస్తున్న. కాంగ్రెస్ వస్తే 10 వేలు చేస్తమన్నరు. ఎన్నికలప్పుడు ముందుగానే బిల్లులు ఇస్తమన్నరు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. జీతాలు, బిల్లులు ఇప్పించండి.
– భాగ్య, మధ్యాహ్న భోజన కార్మికురాలు (పెద్దపల్లి)
నేను ఇరవై ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బిల్లులు, జీతాలు సరిగ్గా వస్తలేవు. అధికారులను బిల్లులు అడిగితే సంతకాలు చేసి పని మానేయ్యి అంటూ బెదిరిస్తున్నరు. ఇప్పటికే చాలా అప్పులు తెచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నం. వేతనాలు ఇవ్వకున్నా కనీసం మెస్, కోడి గుడ్ల బిల్లులు ఇవ్వండి సార్.
– కే సరిత, మధ్యాహ్న భోజన కార్మికురాలు (పెద్దపల్లి)