గంగాధర, సెప్టెంబర్ 16 : బోధన- అధ్యయన సామాగ్రి ద్వారా విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుందని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టిఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తయారుచేసిన బోధన – అధ్యయన సామగ్రిని మేళాలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి టిఎల్ఎం మేళా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలుగు, పరిసరాల విజ్ఞానం, గణితం, ఇంగ్లిష్ విషయాలకు సంబంధించి తక్కువ ఖర్చుతో ఖర్చులేని సామగ్రిని ఉపయోగించి ఉపాధ్యాయులు వర్కింగ్ మోడల్స్‌ను సృజనాత్మకంగా తయారు చేసినట్లు తెలిపారు.
టిఎల్ఎం విధానం ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. బోధన – అధ్యయన సామగ్రిని అద్భుతంగా తయారుచేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఎంఈఓ అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శశికాంత్ రెడ్డి, అనితాకుమారి, ప్రభావతి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.