సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 25 : నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ సిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్’ పేరుతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వరంగల్లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాల ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి జాబ్మేళా ప్రారంభం కానుందని, ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 5 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కోరారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ మేళా మంచి అవకాశంగా నిలవనుందని పేరొన్నారు.