ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాసిరకంగా మారుతున్నదా? ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందాలన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తున్నదా..? ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా.. సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. అందుకు 2022లో ప్రారంభమైన జగిత్యాల మెడికల్ కాలేజే నిదర్శనంగా నిలుస్తున్నది. అందులో కీలకమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు 60 శాతానికిపైగా బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యార్థుల ద్వారా తెలుస్తున్నది. ఆరు ల్యాబ్‌లు ఉండాల్సిన చోట మూడు ఉండగా, 600 మంది విద్యార్థులకు వంద మంది పట్టని గదిలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
జగిత్యాల, మే 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే విద్యాభ్యాసం చేయాలని సంకల్పించారు. అయితే, ఐదేళ్ల కిందట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో 150 మెడికల్ కాలేజీలను మంజూరు చేయగా, రాష్ర్టానికి కనీసం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. దీంతో కేసీఆరే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే రెండు మూడేళ్ల వ్యవధిలో దాదాపు 30 మెడికల్ కాలేజీలను కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అందుకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించారు. జాతీయ వైద్య విధాన పరిషత్ అనుమతులను సైతం సంపాదించారు.
ప్రతి కాలేజీకి బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఇతర పోస్టులను మంజూరు చేశారు. 2022 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తూ వచ్చారు. వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి సైతం భారీగా నిధులు మంజూరు చేశారు. అయితే, 2023 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇబ్బందుల్లో పడిపోయాయి. రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి మౌలిక వసతుల కల్పన లేదు. బోధనా సిబ్బంది నియామకం లేదు.
క్రమక్రమంగా విద్యా సంవత్సరం గడిచిపోయి, మొదటి బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు, మరో ఏడాదిలో తమ ఎంబీబీఎస్‌ను పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. కోర్సు అయితే చదువుతున్నాం కానీ, తమకు నాణ్యమైన విద్య అందడం లేదని, అన్ని అసౌకర్యాలే అని వారు వాపోతున్నారు. 2022లో ప్రారంభమైన జగిత్యాల మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీ లేక, వసతుల కల్పన లేక నాణ్యమైన విద్య అందడం లేదని వాపోయారు. కాలేజీలోని అసౌకర్యాలపై ఇంకా ఎన్నో వివరాలను అందించారు. అయితే, సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని, తమ పేర్లు మాత్రం ఎవరికీ చెప్పవద్దని, ఫొటోలు వేయద్దని వేడుకున్నారు.
జగిత్యాల మెడికల్ కాలేజీని ప్రారంభించిన సమయంలోనే బోధనకు కావాల్సిన బోధన బోధనేతర సిబ్బంది పోస్టులన్నింటినీ కేసీఆర్ సర్కారు మంజూరు చేసింది. ఎలాగైతే విద్యార్థుల పదోన్నతి పొందుతారో (ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు) అలా పోస్టులు భర్తీని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫస్టియర్ సిలబస్‌కు సంబంధించిన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, డిమాన్స్ట్రేటర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేసి, బోధనను ప్రారంభించింది. ఈ విద్యాసంవత్సరం మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఫైనలియర్‌కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో జగిత్యాల మెడికల్ కాలేజీకి పూర్తిస్థాయి పోస్టుల సంఖ్య మంజూరైంది. అయితే, మంజూరైన పోస్టుల్లో దాదాపు 60 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. 41 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు ఉంటే, 21 ఖాళీగా ఉన్నాయి. 51 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 వెకెట్గా ఉన్నాయి. కేవలం ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లే బోధన చేస్తుండడం గమనార్హం. ఇక 139 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 68 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్, డిమానిస్ట్రేటర్కు సంబంధించి 31 పోస్టులకు 27 ఖాళీగా ఉన్నాయి. కేవలం మూడు ట్యూటర్ పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. సీనియర్ రెసిడెంట్ పోస్టులు 76 ఉండగా, 36 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 331 బోధన పోస్టులు ఉంటే, 200 ఖాళీగా ఉన్నాయి.
వివిధ పోస్టుల కొరత ఇలా ఉంటే.. మౌలిక వసతుల కల్పన మరింత అధ్వానంగా ఉందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఎప్పుడూ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంటుందని, అయితే.. కాలేజీలో మూడు ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఒక్క ల్యాబ్‌లో రెండేసి సబ్జెక్టుల ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిన దుస్థితి ఉందని, నాలుగు సంవత్సరాల విద్యార్థులు చదువుతుండడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని వాపోతున్నారు. ల్యాబ్‌ల్లో సరైన విధానంలో ప్రయోగాలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఇక మెడికల్ లైబ్రరీ విషయంలో విద్యార్థులు నాలుగేళ్లుగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శరీర ధర్మాలు, రుగ్మతలు తదితర అన్ని అంశాలను కూలంకషంగా తెలుసుకోవాలంటే కచ్చితంగా నిరంతరం అధ్యయనం చేయాల్సిందేనని చెబుతున్నారు. అందుకు వైద్యరంగానికి సంబంధించిన పుస్తకాలు, దేశ విదేశాలకు చెందిన జర్నల్స్తోపాటు అన్ని స్టడీ మెటీరిల్స్తో అధునాతన లైబ్రరీని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుందని, అయితే కేవలం వంద మంది విద్యార్థులు సైతం కూర్చోవడానికి అనువుగా లేని స్థలంలో లైబ్రరీ ఏర్పాటు చేశారని వాపోతున్నారు. ఒక్కసారి 80 నుంచి 90 మంది విద్యార్థులు కూడా ఆ భవనంలో కూర్చొని అధ్యయనం చేయలేరని, అలాంటిది 600 మంది ఎలా అధ్యయనం చేస్తారని ఆవేదన చెందుతున్నారు.
మెడికల్ విద్యార్థులకు శారీరక దారుఢ్యం కోసం ఆటలు కచ్చితంగా అవసరమవుతాయి. అయితే, జగిత్యాల మెడికల్ కాలేజీలో మైదానం అందుబాటులో లేక ఆటలు ఆడే పరిస్థితి లేదు. హాస్టల్స్ అన్నీ ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తుండడంతో అక్కడ ప్రశాంతంగా చదువుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవాళ్లు ప్రైవేట్‌గా రూములు అద్దెకు తీసుకొని చదువుకుంటున్నారు. ఫైనలియర్ స్టూడెంట్స్‌ను అనుబంధంగా ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రికి వారంలో నాలుగురోజులపాటు తీసుకెళ్లి ప్రాక్టికల్స్‌తోపాటు వ్యాధులపై అధ్యయనం చేయిస్తున్నారు. ఉదయం తీసుకువెళ్లి సాయంత్రం మళ్లీ హాస్టళ్ల వద్ద దించడానికి కాలేజీకి వాహనాలు ఉంటాయని, జగిత్యాల కాలేజీలో వాహనం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
రెండుమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రికి వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తున్నామని, నిత్యం వంద రూపాయలకు పైగా ఆటో చార్జీలు అవుతున్నాయని చెబుతున్నారు. మొదటి సంవత్సరంలో చేరిన తర్వాత బీసీ, ఎస్సీ కేటగిరికి చెందిన విద్యార్థులందరం మెయింటెయినెన్స్ టీచింగ్ ఫీజు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అలాగే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేశామన్నారు. అయితే, ఒకేఒక్క సంవత్సరం ఎంటీఎఫ్, స్కాలర్షిప్ వచ్చిందని, మూడేళ్లుగా మళ్లీ ఏదీ రావడం లేదని వాపోతున్నారు.
వివిధ పోస్టులు భారీగా ఖాళీగా ఉండడంతో ఉన్న ప్రొఫెసర్లు, ఇతర బోధకులు పీపీపీటీ (పవర్ పాయింట్ ప్రజంటేషన్) పద్ధతిని ఫాలో అవుతున్నారు. పెన్డ్రైవ్ల్లో సబ్జెక్టును లోడ్ చేసుకొని రావడం, తరగతి గదిలో ప్రొజెక్టర్‌కు అటాచ్ చేయడం, స్క్రీన్‌పై వచ్చే ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్‌ను బోధించడం రొటీన్‌గా సాగిపోతున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనలియర్లో ఉన్న విద్యార్థులు పీజీ కోర్సుల్లో సీట్లు సాధించేందుకు విధిలేని పరిస్థితుల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి మెడికల్ యాప్స్‌ను సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేసుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు యాప్‌లు కొనుగోలు చేస్తున్నారని, నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.