Electrical accidents | ముకరంపుర, ఆగస్టు 21: విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల్ పనితీరు, హెచ్టీ సర్వీసులకు మోడెంల ద్వారా ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు విధానాన్ని తనిఖీ చేశారు. అనంతరం సర్కిల్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యుత్ సరఫరాలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ స్తంభాలకు ఉన్న టీవీ, ఇంటర్ నెట్ కేబుళ్ల తొలగింపు, ఇతర అంశాలపై క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షించారు. ప్రమాద రహిత విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని సూచించారు.
జిల్లాలో విద్యుత్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మార్చాలని, లూజ్ కనెక్షన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులతో కలిసి కరీంనగర్ తో పాటు మున్సిపాలిటీల్లో విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది తప్పిదాలు ప్రాణాపాయానికి దారితీసే అవకాశాలు ఉన్నందున నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వినాయక ప్రతిమల తరలింపులో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్(ఆపరేషన్)బీ అశోక్, ఎస్ఈ రమేష్ బాబు, డీఈలు ఉపేందర్, రాజం, చంద్రమౌళి, తిరుపతి, లక్ష్మారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీఈలు అంజయ్య, శ్రీనివాస్, లావణ్య, ఏవోలు, ఏఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.