కార్పొరేషన్, డిసెంబర్ 21: బల్దియాలో రోడ్లు వెయ్యకుండా బిల్లులు చెల్లించారని ఆరోపించిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ అవి ఎక్కడో చేశామో నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ చేశారు. ఆరోపణలను నిరూపించకపోతే టవర్‌సర్కిల్‌లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో మొదటి ఫేస్ కింద రూ.112 కోట్లతో రోడ్లు, రూ.118 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, రూ.16 కోట్లతో స్పోర్ట్స్ పనులు, రూ.64 కోట్లతో హౌసింగ్‌బోర్డుకాలనీలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
తమ పాలకవర్గం వచ్చే నాటికి స్మార్ట్‌సిటీ పథకంలో కమాన్ చౌరస్తా సుందరీకరణ పనులకు రూ.24 లక్షలు వ్యయం చేశారన్నారు. తాము నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా పనులు నిర్వహించలేదన్నారు. స్మార్ట్‌సిటీలో చేపట్టిన పనులన్నింటినీ ఎన్ఐటీ వరంగల్ పరీక్షలు చేస్తుందని, అలాగే, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేసిన తర్వాతనే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. స్మార్ట్‌సిటీ కింద ఇప్పటి వరకు రూ.934 కోట్ల పనులకు టెండర్లు చేపట్టి ప్రారంభించామని, వీటిలో ఇప్పటి వరకు రూ.514 కోట్ల బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు.
ఈ పనుల్లో రూ.130 కోట్లు చేతులు మారాయని విమర్శించారని, అవి ఎక్కడ జరిగాయో నిరూపించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిబంధనల మేరకు పని చేస్తుంటే ఇప్పుడు అబండాలు వేయడం సరికాదన్నారు. టవర్‌సర్కిల్‌లో స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనుల్లో అన్ని ఇండ్ల వెల్వేషన్ ఒకే తీరులో ఉండాలన్న ఆలోచన చేసిన మేధావి రవీందర్‌సింగ్ అని విమర్శించారు. ఎవరైన ఉన్న ఇండ్ల వెల్వేషన్ కూలగొట్టి ఒకే తీరులో నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉంటారా అని ప్రశ్నించారు. అది కూడా ఆలోచించని తీరు ఆ నాయకుడిదని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల్లో వెన్నుపోటుదారులు ఎంత మంది పని చేసినా ప్రజలు తమకు అండగా నిలిచి ఎమ్మెల్యేను గెలిపించారని పేర్కొన్నారు. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్న రవీందర్‌సింగ్‌పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తాము నగర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి విచారణ జరిపినా తాము సిద్ధమేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, గందె మాధవి, నాంపెల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.