Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జనవరి 16 : పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పలువురు నాయకులు ఆకాక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు పలువురు నాయకులు ముఖ్య అతిథిగా హాజరై పెద్దమ్మ దేవాయంలో పూజలు చేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్థులు ఇంటికో బోనం వండి, మహిళలు నెత్తిన బోనపుకుండలతో డప్పు చప్పుల్ల మధ్య, శివసత్తుల పూనకాలతో బయలుదేరి పెద్దమ్మతల్లి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనపు కుండల్లో వండిన పాశం, నైవేధ్యాన్ని పెద్దమ్మతల్లి కి సమర్పించి తమ పిల్లాపాపలను చూడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మతల్లి ని వేడుకున్నారు.
పలువురు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున ముదిరాజ్ కులస్థులు పెద్దమ్మతల్లి బోనాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెద్దమ్మ తల్లి మండల ప్రజలను చల్లగా కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారు రమేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రానవేన శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, వార్డు సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.