పదేళ్లు పచ్చటి కాంతులతో విలసిల్లిన తెలంగాణ ఏడాదిన్నరలోనే ఏడారిలా మారి.. ఎండ మావులు కనిపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా సబ్బండ వర్గాల్లో నూతనోత్తేజం నింపింది. అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యుల్లోనూ భరోసా కలిగించింది. పదేళ్ల పాలనలో ఊరూరా జల సిరులు, కల్లాల్లో ధాన్యపురాశులు దర్శనమివ్వగా.. అనతికాల కాంగ్రెస్ పాలనలో ఎండిన చెరువులు, ఎడారులైన వాగులు దర్శనమిస్తున్నాయని వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నది.
బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తీరు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసింది. మొత్తంగా కనీవిని ఎరుగని రీతిలో సకల జనాన్ని కదిలించిన ఈ ఎల్కతుర్తి సభ తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులను తలపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిన ప్రజానీకం ఇప్పుడు కేసీఆర్ నామస్మరణ చేస్తున్నది. నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుని ఎవరి పాలన ఎలా ఉందో బేరీజు వేసుకుంటున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఏడాదిన్నర పాలనలోనే అంతా తారుమారైంది. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఆరు గ్యారెంటీల పరిస్థితి అంతే! సామాన్యులకు భరోసా లేదు! రైతు భరోసా లేదు. రుణమాఫీ పూర్తి కాలేదు. సాగునీరు లేదు. పంట కొనే దిక్కులేదు. పింఛన్పెంపు లేదు. తులం బంగారం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఒక్క వర్గమూ పూర్తి స్థాయిలో సంతోషంగా లేదు.
ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో బీఆర్ఎస్ను దూరం చేసుకున్నామనే భావన కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎల్కతుర్తిలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సామాన్యుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. అధినేత కేసీఆర్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లోనే కాదు, ప్రజల్లోనూ నూతనోత్సాహం నింపింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఏ విధంగా పురోగమించింది.? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అధఃపాతాళానికి ఎలా పడిపోయింది? అనే చర్చ మొదలైంది.
కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెస్తున్నది. పదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన తెలంగాణ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయిందని చెప్పిన మాట ప్రజల్లో చర్చకు దారి తీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఊరూరా జల సిరులు పారించామని, తద్వారా ప్రతి రైతు చేనులో ధాన్యపు సిరులు విలసిల్లాయని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా..? అనే చర్చ జరుగుతున్నది. ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేని అసమర్థ కాంగ్రెస్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైనట్లేనని, కేసీఆర్ ఆ పని చేసి పెట్టారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు..
జనప్రవాహం
రజతోత్సవ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జనం తండోపతండాలుగా కదిలారు. ముఖ్యంగా యువకులు, యువతులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, మేధావులు ఇలా ప్రతి వర్గం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినాలనే కుతూహలంతో తరలి వెళ్లారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల అనే తేడా లేకుండా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 2లక్షలపైనే జనం వెళ్లారు. ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్ మీదుగా వరంగల్ వెళ్లే దారులన్నీ గులాబీ మయమయ్యాయి. బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంపై కార్యకర్తలు, సామాన్య జనం బీఆర్ఎస్ సభకు వెళ్లారు. స్వచ్ఛందంగా తరలిన జనాన్ని చూస్తుంటే కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒక్క పార్టీ కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు తండోప తండాలుగా తరలి వెళ్లడం బీఆర్ఎస్పై తమకున్న విశ్వాసానికి సంకేతంగా చెప్పవచ్చని అంటున్నారు.
సరికొత్త స్ఫూర్తి
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త స్ఫూర్తిని నింపింది. అధికారం కోల్పోయి ఏడాదిన్నర గడుస్తున్న పార్టీపై కార్యకర్తల్లో ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కుచెదర లేదని ఈ సభ నిరూపించింది. అధికారంలో ఉన్నా, లేకున్నా తామంతా ప్రజల పక్షమే అన్నట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలను కదిలించిన తీరును బట్టి అర్థమవుతున్నది. ప్రజలు తమ వెంటే ఉన్నారని ఈ సభ ద్వారా అధికార పార్టీకి సంకేతాలు పంపినట్టయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని అందించింది. ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సిన విషయాలన్నింటినీ కేసీఆర్ తన ప్రసంగంలో విఫులంగా వివరించారు. బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించడంతోపాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు.
బీజేపీ వైపల్యాలను కూడా ఎండగట్టారు. అంతే కాకుండా కార్యకర్తలెవరూ నిరూత్సాహ పడొద్దని, ఇంకా రెండున్నరేండ్లే కాంగ్రెస్ పాలన ఉంటుందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది తమ పార్టేనని కేసీఆర్ భరోసానిచ్చారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. కరీంనగర్, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సభ సక్సెస్ చేసిన కార్యకర్తలకు కృతజతలు చెప్పారు.
ఏడాదంతా సంబురాలే..
పార్టీ రజతోత్సవాలను ఎల్కతుర్తి సభతోనే సరిపెట్టకుండా ఏడాది పొడువునా నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలలో డిజిటల్ సభ్యత్వ నమోదును చేపడుతున్నారు. ఆ తర్వాత గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో కమిటీల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అంతే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 500 మంది సుశిక్షితులైన కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు.
ఒక పక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే పార్టీ సంస్థాగత బలోపేతానికి పక్కా ప్రణాళికలు వేసుకున్న బీఆర్ఎస్ ఏడాదంతా రజతోత్సవ సంబురాలను వినూత్న పద్ధతుల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో నిత్యం ఉత్సాహాన్ని నింపేలా ఉంటాయని అధిష్టానం భావిస్తున్నది.