Singareni Medical Board | గోదావరిఖని : సింగరేణి సంస్థలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని విజిలెన్స్ మారు పేర్ల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ తో ఈనెల 13న గోదావరిఖనిలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తెలిపారు. గోదావరిఖని పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకుండా డిపెండెంట్ ఉద్యోగాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి రామగుండం డివిజన్-1 జనరల్ మేనేజర్ కార్యాలయానికి చేపట్టిన భారీ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు డిపెండెంట్లు హాజరు కావాలని నిరసన తెలియజేయాలని ఆయన కోరారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థలు 18 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ చేపడతామని చెప్పడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వైఖరితో ఉందనేది అర్థమవుతుందన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇతర అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్థానికంగా సింగరేణి ఉద్యోగుల డిపెండెంట్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మెడికల్ బోర్డు డిమాండ్‌తో పాటు విజిలెన్స్ కేసుల పేరిట ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అంశంపై దీనికి తోడు మారుపేర్ల సమస్యతో ఉద్యోగాలు లభించకుండా వేచి చూస్తున్న వారికి న్యాయం చేసేందుకు పోరాటం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకుడు పర్లపల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు జెవి రాజు, పున్నం, శశి కుమార్, వాసర్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.