రాజన్న సిరిసిల్ల, జూన్ 20(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్‌షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకుని, పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గితే వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని అపెరల్ పార్క్‌లో గోదాం మేనేజర్‌గా పని చేస్తున్న కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఉత్కం విజయ్‌కుమార్, వేములవాడ రూరల్ మండలం అచ్చనపల్లికి చెందిన వాసాల గణేశ్ కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్షీట్లు తయారు చేసేవారు.
ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనుచరుడైన రుద్రంగి లోని డీసీఎంఎస్ సెంటర్ ఇన్చార్జి గడ్డం స్వామి రెండు లారీలకు నకిలీ ట్రక్షీట్లు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్‌కుమార్ సివిల్ సప్లయి వెబ్సైట్లో అప్లోడ్ చేయగా వచ్చిన నిధులను పంచుకున్నారు. అదేవిధంగా డీఎంవో కార్యాలయంలో మండలస్థాయి కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న కమ్మరి రాజశేఖర్, బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్‌తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ షీట్ రూపొందించి విజయ్‌కుమార్‌కు అందించారు.
అతడు దానిని సివిల్ సప్లయి వెబ్సైట్లో అప్లోడ్ చేయగా రాజశేఖర్ ఆమోదం తెలిపాడు. ఇలాగే, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపెరల్ పార్క్ గోదాంకు వచ్చిన పది లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్లైన్లో మాత్రం దించినట్లు నమోదు చేశారు. అనంతరం ధాన్యాన్ని వేములవాడకు చెందిన చేపూరి మధుకర్‌కు అప్పగించారు. మధుకర్ సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్‌మిల్లులకు ధాన్యాన్ని విక్రయించారు. ఈ క్రమంలో వచ్చిన డబ్బులను పరస్పరం పంచుకున్నారు. అయితే, అపరెల్ పార్కులోని గోదాంల నుంచి 150 నుంచి 200ధాన్యం బస్తాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేసిన గోదాం ఇన్చార్జి విజయ్‌కుమార్ ఈ కేసులో ఏ-1గా ఉండడం గమనా ర్హం.
కాగా, వీరి మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లయి మేనేజర్ ఎస్ నరసింహ ఈ నెల 15న సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా, ప్ర భుత్వ నిధులు రూ.91లక్షలు అక్రమంగా మళ్లించినట్లు విచారణలో తేలింది. నిందితులైన ఉత్కం విజయ్‌కుమార్, వాసాల గణేశ్, సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన కమ్మరి రాజశేఖర్, వేములవాడకు చెందిన చేపూరి మధుకర్, తంగళ్లపల్లి మండ లం బద్దెనపల్లికి చెందిన గాజుల నవీన్, సిద్దిపేటకు చెందిన కమీషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్‌ను అ రెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.14,16,800 నగదు స్వాధీనం చేసుకొని, మరో రూ.46,21,358 నగదును బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనుచరుడైన రుద్రంగికి చెందిన గడ్డం స్వామి ఈ కేసులో ఏ-3గా ఉన్నాడు. జిల్లాలో ప్రత్యేకంగా రుద్రంగికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయించుకున్నారు. సెంటర్ ఇన్చార్జి గడ్డం స్వామి నకిలీ ట్రక్షీట్లు సృష్టించి ధాన్యం అమ్ముకొని పోలీసులకు అడ్డంగా దొరకడం జిల్లాలో కలకలంరేపింది. కాగా, శనివారం పోలీసులు నిందితులను అరెస్ట్ చేయగా గడ్డం స్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా వరి ధాన్యం అపహరణ కేసులో విప్ ఆది శ్రీనివాస్ అనుచరుడైన కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మల్కపేట ఐకేపీ సెంటర్ జంగిలి శ్రీనివాస్‌తోపాటు మరో ముగ్గురు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.