రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేత కార్మికులు ఆందోళ నబాట పట్టారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లపాటు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్ల వేలాది మంది కార్మికులకు చేతి నిండా పని దొరికిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల తయారీ బంద్ అయిందని, ఉపాధి లేక అనేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధార పడ్డ వేలాది మంది కార్మికుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు.
కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని కలెక్టర్, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. వెంటనే యారన్ సబ్సిడీ విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, అన్నల్దాస్ గణేశ్, నక్క దేవదాస్, కూచన శంకర్, మల్లారెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.