Odela | ఓదెల, నవంబర్ 15: పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేస్తే మంచిదని ప్రజలు నమ్ముతారు.
దీంతో శనివారం ఓదెల మల్లన్న ఆలయంలో మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని ఆలయ పాలకవర్గం చేపట్టింది. ఇందులో విశ్వక్సేన, రక్షాబంధకం, పంచగవ్య ప్రవచన, నవగ్రహ ఆరాధన, శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 100 మందికి పైగా దంపతులు పాల్గొన్నారు.
వారికి దేవాలయం వారు పూజా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు సత్యనారాయణ వ్రత స్వామి పూజ చేయడం ప్రాముఖ్యతను వివరించారు. పూజలో వేద పండితులు ఆరుట్ల శ్రీనివాసచార్యులు, నరసింహచార్యులు, ధూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్ నిర్వహించారు. కాగా ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో బోడ్క సదయ్య, పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.