Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 9: నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముందుగా మార్కండేయ కాలనీ శివాలయంలో యజ్ఞోపవీత, లోక కల్యాణార్థం గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. అర్చకులు రాఘవాచార్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పద్మశాలీలకు జంజరాలను ధరింపచేశారు.
హోమం అనంతరం స్థానిక ప్రధాన చౌరస్తా వద్ద నుంచి మార్కండేయుని రథయాత్ర కన్నుల పండువగా సాగింది. పలువురు పద్మశాలీలు తరలివచ్చి ఉత్సవ మూర్తుల వద్ద కొబ్బరికాయలు కొట్టి మార్కండేయుడిని వేడుకున్నారు. కాగా, ఈ రథం వెనుక ప్రత్యేక వాహనంపై మగ్గం అమర్చి నేత నేసి ఉత్తరీయాన్ని తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం శోభాయాత్ర పుర వీధుల గుండా సాగుతుండగా మహిళలు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. రథయాత్రలో పద్మశాలీలు నేసిన నూలు వస్త్రంను తిరిగి శివాలయంకు చేరుకున్నాక మార్కండేయునికి సమర్పించారు.
కార్యక్రమంలో పద్మశాలీ సేవా సంఘం, పోపా, యువజన, మహిళా సంఘం సభ్యులు వడ్డెపల్లి దినేష్, రాజమల్లు, బూర్ల దామోదర్, అనుమ రాయమల్లు, కొండి లక్ష్మీపతి, వంగ వీరస్వామి, వల్లకట్ల రాజేశం, సంబయ్య, పిట్ట లక్ష్మీనర్సయ్య, మూర్తి, కొండయ్య, పోరండ్ల కొండయ్య, వెంకటేశ్వర మాటేటి సతీశ్, బొద్దుల వేణు, తాటిపాముల రాజేశ్, శంకరయ్య, వేముల రజిత, శ్రావణ్ తోపాటు అధిక సంఖ్యలో పద్మశాలీలు పాల్గొన్నారు.