Surrender | ఫర్టిలైజర్ సిటీ, జనవరి 24 : జనంలో కలిసి సాదాసీదా వ్యక్తుల మాదిరిగా, ఎక్కడో మారుమూల పల్లెల్లో గూడెం జాతులకు చెందిన వ్యక్తుల్లా కనిపించే చాటుమాటు నక్సలైట్లు శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు. మిలీషియా టీం సభ్యులు బయటకు రావడం ఇక్కడిదే మొదటిసారి. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయినట్లు ప్రకటించారు. తాము సైతం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిశ్చయించుకొని బయటకు వచ్చినట్లు వారు తెలిపారు.
వీరిలో ఒకరు మాత్రమే తెలంగాణకు చెందిన వాడు కాగా, మిగతా వారు చత్తీస్ ఘడ్ రాష్ట్రంకు చెందిన వారే. లొంగిపోయిన వారిలో ధర్మాజ్ శ్రీకాంత్ (33), పొడియం కాములు, ముడియం జోగ, కుంజం లక్కె, మోదం భీమ, కుంజం ఉంగా, ముడికం సుక్రం, ముడియం మంగు ఉన్నారు. వీరిలో ధర్మాజీ శ్రీకాంత్ జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఇటిక్యాల కాగా, 2019 నుంచి మావోయిస్టుకు కొరియర్ గా పని చేసినట్లు తెలిపారు. అలాగే కాములు మిలీషియా కమాండర్ 2024లో దుమ్ముగూడెంలో అరెస్టై 2025లో విడుదలై తను కొరియర్ గా పని చేసినట్లు తెలిపారు. అలాగే కాములు మిలిషియా కమాండర్ 2024లో దుమ్ముగూడెంలో అరెస్టు 2025లో విడుదలై తన కార్యకలాపాలు కొనసాగించినట్లు పేర్కొన్నారు.
అలాగే ముడియం జోగ (25) చైతన్య నాట్య మండలితో సంబంధం కలిగి సాంస్కృతిక ప్రచారంలో పాల్గొనేవాడు. కుంజం లక్కె అనే మహిళ 23 ఏండ్లకే గతంలో ఆంధ్రి ఎన్కౌంటర్లో తప్పించుకొంది. మోదం బీమ మిలీషియా సభ్యుడిగా స్థానిక సహాయక కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. ఇక కుంజం ఉంగా గూడాచార్య సమాచార సేకరణ, లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వర్తించేవాడు.
సుక్రం 25 యేళ్ల వయసులోనే మిలీషియా సభ్యుడిగా స్థానిక ప్రాంత కార్యకలాపాలలో పాల్గొనేవాడు. మంగు జంగిల్ కమిటీమిలిషియా కమిటీగా కొనసాగుతున్నాడు.. వీరందరిలో శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణకు చెందిన వాడు కాగా, మిగతావారు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపుల్కు చెందిన వారని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు రాజేంద్రప్రసాద్, భీమేష్, ఆర్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.