Korutla | కోరుట్ల, జూలై 25 : కోరుట్ల ఎస్ఐ చిరంజీవిని విచారణ చేయకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఎస్ఐని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య కోరుట్లకు శనివారం రాగా కొత్త బస్టాండు వద్ద గల బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి దళిత సంఘాల ప్రతినిదులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు వెంకటయ్యను సత్కరించిన అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఎస్ఐపై సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత ఎస్ఐపై అధికారులు ఏలాంటి విచారణ జరుపకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు.
ఇటీవల మెట్పల్లిలో హత్యకు గురైన కర్రె సునీత గతంలో తనపై జరిగిన దాడిపై కోరుట్ల పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇచ్చిందనే ప్రచారం అవాస్తమన్నారు. సునీతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా కసుల గంగారెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నాడని తెలిపారు. బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా, ఎస్ఐని సస్పెండ్ చేయడం సమంజసం కాదన్నారు. ఈవిషయంలో సమగ్ర విచారణ జరిపి ఎస్ఐని విధుల్లోకి తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతి పత్రం అందించామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్, రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, వుయ్యాల నర్సయ్య, చెట్పల్లి లక్ష్మణ్, మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు ఉయ్యాల శోభన్, మాల, మాదిగ కుల సంఘాల నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, బలిజ రాజశేఖర్, పసులు చిన్నయ్య, మోర్తాడ్ రాజశేఖర్, సామల్ల వేణు, సత్యం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.