Sircilla | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, నేతన్నకు మరింత ఊతమిస్తున్నది. చేతినిండా పని కోసం ఇప్పటికే ఏటా 350కోట్ల విలువైన బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లను ఇస్తూ బాసటగా నిలుస్తూనే, ఏడాది పొడవునా ఉపాధి కల్పన కోసం తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా ఇచ్చే ‘అమ్మ’ చీరెల తయారీ ఆర్డరును ఇప్పించింది. 2కోట్ల మీటర్ల వస్ర్తోత్పత్తి.. 30లక్షల చీరెలు తయారు చేస్తుండగా, ఏటా వెయ్యి మందికి పైనే పని కల్పిస్తున్నది. మంచి పగారా.. ఏడాదంతా పనితో కార్మికుల జీవితాలు నిలబడగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో చతికిల పడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశం లో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది. చేనేత జౌళీశాఖ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్లకే ఇస్తూ వస్తున్నది. ఏటా మొత్తం ఆరులక్షల మీటర్ల వస్త్రం, కోటి చీరల తయారీ కోసం 350కోట్ల ఆర్డర్‌ను ఇస్తూ మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని, పనికి తగ్గ కూలీ వచ్చేలా చర్యలు తీసుకున్నది. ఈ లెక్కన ఏటా కార్మికులకు ఎనిమిది నెల ల నిరంతరం ఉపాధి దొరుకుతుండగా, కొత్తగా ‘అమ్మ’ చీరల తయారీతో అదనపు ఆదాయం వస్తున్నది.
సిరిసిల్లకు తమిళనాడు చీరలు..
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరల మాదిరి తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ‘అమ్మ’ పథకం పేరిట అక్కడి పేద మహిళలకు చీరలు, పురుషులకు పంచెలను ఉచితంగా అందిస్తున్నది. ప్రతి సంక్రాంతి పండుగ పొంగల్‌కు అందిస్తున్న చీరలు దాదాపు మూడు కోట్ల దాకా ఉంటాయి. వీటి తయారీని ఇదివరకు తమిళనాడులోని సేలం, ఈరోడ్, తిరుపూరు, కోయంబత్తూరులోని మరమగ్గాలపై చేసేవారు. అయితే ఆంధ్రాకు చెందిన రామారావు అనే వ్యాపారి సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడి మరమగ్గాలు, కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సిరిసిల్లకు ఆర్డర్లు ఇప్పించేలా చొరవ తీసుకున్నారు. మధ్య దళారీ వ్యవస్థతో కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగదని భావించి, ఆయనే కాంట్రాక్టు తీసుకుని 2014 నుంచి చీరల ఉత్పత్తి చేయిస్తున్నారు.
150 రంగుల్లో తయారీ..
అమ్మ చీరల కోసం ఏటా రెండు కోట్ల మీటర్ల వస్రోత్పత్తి, 30లక్షల చీరల తయారీ ఆర్డర్ కార్మికులకు వస్తున్నది. 5.50మీటర్ల పొడవుగల చీరలను 150 రంగుల్లో తయారు చేస్తున్నారు. ప్రతిరోజూ మూడు వేల సాంచాలపై రెండులక్షల మీటర్ల వస్ర్తాలు తయారు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నట్లు రామారావు తెలిపారు. ఈ చీరల తయారీతో వెయ్యి మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందులో నేత కార్మికులు, వైపనీ, వార్పిన్, హమాలీ, ప్యాకింగ్, గుమస్తాలకు చేతినిండా పని దొరుకుతున్నది. బతుకమ్మ చీరల తయారీతో కార్మికులకు నెలకు రూ.20వేల దాకా కూలీ గిట్టుబాటు అవుతుండగా, తమిళనాడు చీరల తయారీతో రూ.12వేల నుంచి రూ.15వేలు వస్తున్నట్లు కార్మికులు తెలిపారు. ఈ చీరల తయారీ సంక్రాంతి పండుగ వరకే కాకుండా ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తున్నారు.
అమ్మ చీరలతో చేతి నిండా పని
మాది వరంగల్ జిల్లా శాయంపేట. ఉపాధి కోసం మహారాష్ట్రకు పోయిన. అక్కడ ఏం పాయిదా లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్లతో మంచి పగార దొరుకుతున్నద ని తెలిసి నాలుగేండ్ల కింద మహారాష్ట్ర వదిలి ఇక్కడికి వచ్చిన. బతుకమ్మ చీరలతో ఎనిమిది నెలలపాటు పని దొరుకుతంది. నెలకు రూ.20వేల దాకా దొరుతున్నయి. కేటీఆర్ దయవల్ల చేసిన కాడికి పగార మంచిగున్నది. ఎలాంటి రంది లేదు. దీనికి తోడు అమ్మ చీరల కోసం మూడు నెలల పని ఇస్తుండ్రు. పగార తక్కువ ఉంది కానీ పని ఉంటుంది. ఏడాదంతా బతుకమ్మ చీరల పనికల్పిస్తే బాగుండు.
– గుర్రం రవి, నేత కార్మికుడు, వరంగల్ జిల్లా
ఇక్కడే బాగుంది..
మాది హుజురాబాద్. బతుకుదెరువు కోసం సాంచాలు నడిపేందుకు ఇక్కడికి వచ్చిన. ఒక్కడినే పొట్టకు తింటూ తోటి కామ్గార్లతో కలిసి ఉంటున్నా. ఎనిమిది నెలల పాటు బతుకమ్మ చీరలు నడిపిస్తే పగార బాగొస్తుంది. మొత్తం ఎనిమిదినెలల పని ఉంటది. ఇంకో మూడునెలలు వట్టిగ ఉండుడెందుకని అమ్మ చీరలు తయారు చేస్తున్న. వీటికి ఎక్కువ పని ఉండదు కాబట్టి రోజుకు రూ.నాలుగైదు వందల పగార వస్తుంది. పొట్టమందమైతున్నయి. ఎక్కడికో పోయి పనిజేసుకునే కంటే ఇక్కడే బాగుంది.
– పత్తిపాక సాంబయ్య, నేత కార్మికుడు
తమిళనాడు చీరల తయారీతో అదనపు ఉపాధి
ఇక్కడి కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి తమిళనాడుకే పరిమితమైన చీరల తయారీని తాను సిరిసిల్లకు తెచ్చిన. 2014 నుంచి నిరంతరాయంగా పొంగల్ చీరలు తయారీ చేస్తున్నాం. తొలుత కాటన్ చీరల తయారీ చేపట్టిన. సిరిసిల్లలో సైజింగ్‌లు తగ్గడం, కాటన్ పరిశ్రమ అంతంత మాత్రమే ఉన్నందున పాలిస్టర్ చీరలు తయారీ చేయిస్తున్నాం. మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీతో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. తాను తెచ్చిన తమిళనాడు చీరల తయారీ ఆర్డర్లతో అదనపు ఉపాధి దొరుకుతున్నది. మరిన్ని ఆర్డర్లు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– రామారావు, వస్త్ర ఉత్పత్తి దారు, సిరిసిల్ల